-ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి – గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా లే-అవుట్లు ఏర్పాటు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించి సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా లే-అవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు జరిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం నగరంలోని ఆదర్శనగర్, సుబ్బారెడ్డినగర్ ప్రాంతాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న లే-అవుట్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే మానస సరోవరం పార్కు సమీపంలో విండ్రో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలోని అనధికార లే-అవుట్లను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. లే-అవుట్ నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఓపెన్ స్పేస్ స్థలాల వివరాలను వెంటనే ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
ప్రజలు స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సంబంధిత లే-అవుట్‌కు గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) లేదా సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. అనధికార లే-అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని హెచ్చరించారు. అనుమతులు లేని లే-అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు పొందడం, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
అనంతరం మానస సరోవరం పార్కు సమీపంలో విండ్రో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో సిటీ ప్లానర్ డి. రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, డీసీపీ సూరజ్ కుమార్, ఈఈ సుందర్రామిరెడ్డి, డీఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సాంబయ్యతో పాటు ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
