-తొలి విడత విజయాల స్ఫూర్తితో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ ముందుకు సాగాలి
-సమష్టి కృషితో ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
-స్థానిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం విజయాల స్ఫూర్తితో ముందుకు సాగాలి
-తాడేపల్లిగూడెంలో కూటమి మున్సిపల్ అభ్యర్థులతో ఎమ్మెల్సీ నాగబాబు ప్రత్యేక భేటీ
-మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై కూటమి అభ్యర్థులకు దిశానిర్దేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతలో ఎలాగైతే 100 శాతం విజయాలను సాధించామో, అదే స్ఫూర్తి, ఐక్యత, సమన్వయంతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ముందుకు సాగాలి. నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు సమష్టిగా, సమన్వయంతో పని చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. పరస్పర సహకారం, సమన్వయంతో ఎన్నికల కార్యాచరణను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలి” అన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో నాగబాబు ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసేవలో బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
