తుఫాన్లతో ఏపీలో ఉద్యాన పంటలకు రూ.1,092 కోట్ల నష్టం

-అర్నబ్, మురసు తుఫానులతో నష్టపోయిన ఉద్యాన రైతాంగం
-ఉద్యాన పంటల పునరుద్ధరణకు రూ.96 కోట్ల అదనపు సాయానికి వినతి
-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రెండు వరుస తుఫాన్ల కారణంగా దెబ్బ తిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు వివిధ కేంద్ర పథకాల కింద అదనపు సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాశారు. ఇటీవల సంభవించిన అర్నబ్, మురసు తుపానుల కారణంగా రాష్ట్రంలో ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లిందని లేఖలో ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 28, నవంబర్ 2, తేదీలలో వరుసగా ఏపీని తాకిన ఈ రెండు తుపానుల ధాటికి 18 జిల్లాల్లోని 29,960 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల 71,576 మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. అర్నబ్ తుఫాను కారణంగా 215 మండలాల్లోని 23,211 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు వివరించారు. ఒక్క అరటి పంటే 15,549 హెక్టార్లలో దెబ్బతిందని వివరించారు. మురసు తుఫాను ప్రభావంతో 108 మండలాల్లోని 6,748 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సీఎం తెలిపారు. దెబ్బతిన్న తోటల పునరుద్ధరణ, రైతులను ఆదుకునేందుకు వివిధ కేంద్ర పథకాల కింద అదనంగా రూ.96.33 కోట్ల సాయం అందించాలని సీఎం కోరారు. అత్యధికంగా అరటి పంట తీవ్రస్థాయిలో దెబ్బతిందని దానిని పునరుద్ధరించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద హెక్టారుకు రూ.44 వేల చొప్పున నిధులు అందించాలని కోరారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎండుమిర్చి, కూరగాయల పంటలను ఆదుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, తదితర జిల్లాల్లో మొవ్వ విరిగిన కొబ్బరి చెట్లకు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. తోటల పునరుద్ధరణ, దీర్ఘకాలిక ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు త్వరితగతిన సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.