-బియ్యం నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా
-ధరల నియంత్రణకు నెలకు రూ. 100 కోట్లు ఖర్చు
-ధరలను అదుపులో ఉంచేలా నిరంతర మార్కెట్ వాచ్… అగ్రీవాచ్
-రైతులకు నష్టం రాకూడదు… వినియోగదారులకు కష్టం కలగకూడదు
-నిత్యావసరాల ధరల నియంత్రణపై సమీక్షలో ముఖ్యమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, మార్కెట్ జోక్యంపై ఏడాది కాలానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతివారం అధికారులు సమీక్షించాలని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ధరలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్‌ను రేషన్ షాపుల ద్వారా విక్రయిస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కిలో రూ.100 చొప్పున కందిపప్పు, రూ. 25 చొప్పున గోధుమ పిండి, లీటర్ రూ.125 చొప్పున పామాయిల్‌ను రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రైతు బజార్ల ద్వారా కిలో రూ.35కు ఉల్లి విక్రయాలు కొనసాగుతున్నాయని… ధరణి బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు రైతు బజార్లల్లో విక్రయిస్తున్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడిందని మంత్రి మనోహర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. బహిరంగ మార్కెట్లో కూడా బియ్యం ధరలను అదుపులో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. బియ్యం హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. తక్కువ ధరలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకోవాలని… ఈ మేరకు వ్యవసాయం, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రైతు బజార్లు వంటి విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధరల పెరుగుదల అంశంపై ఇబ్బంది వచ్చినప్పుడే కాకుండా నిరంతరం సమీక్షిస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ధరల నియంత్రణ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏడాది కాలానికి కార్యాచరణను సిద్దం చేసుకోవడంతోపాటు… ప్రతివారం అధికారులు సమీక్షించాలని సీఎం సూచించారు. పంట పండించిన రైతుకూ నష్టం వాటిల్లకూడదు…. అలాగే వినియోగదారునికీ కష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధరలను అదుపులో పెట్టేందుకు అవసరానికి తగ్గట్టుగా… ప్రణాళికా బద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తే…. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గుతాయని చెప్పారు. ఇక డిమాండ్, ధరలను దృష్టిలో పెట్టుకుని వివిధ పంటల సాగును పెంచేలా… ఉత్పత్తి మార్కెట్టులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. కందిపప్పు ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ధరలను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటూనే… భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంది పంటను ప్రొత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే నాసిక్ రకం ఉల్లిపాయలను మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పండించవచ్చో అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లో నాసిక్ ఉల్లి సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
కూరగాయల ధరలూ అదుపులో ఉండాలి
ధరలను అదుపులోకి తెచ్చేందుకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేందుకు ఖర్చు అవుతుందనే ఆలోచన వద్దని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రస్తుతం నెలకు రూ.100 కోట్లు వరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వం ఖర్చు పెడుతోన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో గుర్తుచేశారు. ఇక రాష్ట్రంలో బియ్యం నిల్వలు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హోల్ సేల్ డీలర్లు కావచ్చు… మిల్లర్లు కావచ్చు… ఎవరి వద్ద ఎంత మేర బియ్యం నిల్వలు ఉన్నాయనే అంశంపై అధికార యంత్రాంగానికి స్పష్టత ఉండాలన్నారు. ధరల నియంత్రణ విషయంలో నిరంతరం మార్కెట్ వాచ్, అగ్రీ వాచ్ చేస్తూ… వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. నిత్యావసరాలతో పాటు… కూరగాయల ధరలు కూడా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు రైతు బజార్లు కీలకంగా వ్యవరించాలన్నారు. అలాగే ధరల నియంత్రణపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందులో విజిలెన్స్ నిఘా పెంచాలని సమీక్షలో వర్చువల్ గా పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్ సహా పౌర సరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
