మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి : మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కల్పిస్తూ వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్, వేట నిషేధ సమయంలో రూ.20 వేల భృతి అందిస్తున్నామని తెలిపారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారికి నెల రోజుల్లోపు డెత్ సర్టిఫికెట్ జారీ చేసి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించే జీవో నెం.217ను ఎన్నికల హామీ మేరకు రద్దు చేశామని, డీజిల్ సబ్సిడీతో పాటు ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని వివరించారు.

మత్స్యకారులు కేవలం చేపల వేటపైనే ఆధారపడకుండా మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. మత్స్యకార మహిళలకు సీ వీడ్ సాగు, తయారీలో శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేసి బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.