ముఠా కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలి: సీఐటీయూ

-కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముఠా కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించి, ప్రమాద బీమా, ఆరోగ్య సదుపాయాలు, పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్, ఎన్టీఆర్ కాంప్లెక్స్ ముఠా సెంటర్ వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీఐటీయూ సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె. దుర్గారావు, ముఠా వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం. సీతారాములు మాట్లాడుతూ ముఠా కార్మికులకు గుర్తింపు కార్డులు, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. కార్మికుల హక్కులను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంటూ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలను నియంత్రించాలని కోరారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని, ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. సోమేశ్వరరావు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకుడు సి.హెచ్. నరసింహులు తదితరులు పాల్గొన్నారు.