-అమరావతి అభివృద్ధి పనులు, ఆధునిక భవనాల రూపకల్పనపై ప్రశంసలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళిక, నగర రూపకల్పన, ఆధునిక ఆర్కిటెక్చర్, సుస్థిర పట్టణాభివృద్ధిపై అవగాహన పెంపొందించుకునేందుకు ఐస్‌లాండ్‌కు చెందిన ప్రముఖ ప్రతినిధి బృందం శుక్రవారం అమరావతిలో పర్యటించింది.
ఈ బృందంలో నార్డిక్ ఆఫీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఐస్‌లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాల్డోరా విఫిల్స్‌డోట్టిర్ (Ms. Halldóra Vífilsdóttir), ఐస్‌లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్ఫుసన్ (Dr. Thor Sigfusson) ఉన్నారు. సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రతినిధులకు చీఫ్ ఆర్కిటెక్ట్ సందీప్ దీక్షిత్, సీనియర్ ఆర్కిటెక్ట్‌లు ప్రసున్న, సుమిత్ర స్వాగతం పలికారు.
అనంతరం APCRDA అదనపు కమిషనర్, AGICL మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ కుమార్, ఐఏఎస్, అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (AICCC)లో రాజధాని నిర్మాణ ప్రణాళికపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజారాజధానిగా అమరావతి లక్ష్యాలు, బ్లూ-గ్రీన్ మాస్టర్ ప్లాన్, నగర నిర్మాణ రూపకల్పన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలను వివరించారు. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, సుస్థిర పట్టణాభివృద్ధి, భవిష్యత్తులో పరస్పర సహకార అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమాశంకర్ నాయక్ పాల్గొన్నారు.
అమరావతి నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ప్రముఖ ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు తమ ప్రాజెక్టుల వివరాలను ప్రతినిధి బృందానికి వివరించారు. ఫోస్టర్ + పార్ట్‌నర్స్ సంస్థకు చెందిన జెన్ (అలెక్స్) కియాన్, హరిత శాసనసభ, హైకోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ భవనాల డిజైన్లు, నిర్మాణ రూపకల్పనలోని ప్రత్యేకతలను వివరించారు. సెంట్రల్ పార్క్ అభివృద్ధి ప్రణాళికను సీనియర్ ఆర్కిటెక్ట్ సాహిత్య వివరించారు.
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ ఎస్‌జే గ్రూప్ తరఫున ప్రోగ్రామ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మను చౌదరి, ఆర్కిటెక్ట్ అశ్విన్ పొంగూరు, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ కీర్తి చంద్ర ప్రాజెక్టుల అమలు, మౌలిక సదుపాయాల సమన్వయం, ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి ప్రణాళికలపై వివరించారు.
ప్రధాన నిర్మాణాలను సందర్శించిన ప్రతినిధి బృందం
ప్రజెంటేషన్ల అనంతరం ఐస్‌లాండ్ ప్రతినిధి బృందం అమరావతిలోని పలు కీలక నిర్మాణ ప్రాంతాలను సందర్శించింది. హెచ్‌ఓడీ టవర్లు, శాసనసభ సముదాయం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, క్వాంటం వ్యాలీని పరిశీలించింది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి, భవనాల ప్రత్యేకతలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సుస్థిర అభివృద్ధికి అనుగుణంగా చేపడుతున్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ ప్రణాళిక, భవనాల రూపకల్పన, అభివృద్ధి పనుల వివరాలను ఐస్‌లాండ్ ప్రతినిధి బృందం పరిశీలించి అభినందించింది. సుస్థిర పట్టణాభివృద్ధి, ఆధునిక ఆర్కిటెక్చర్, నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో ఇరు పక్షాలు తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పించింది.
ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు APCRDA కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.
