-థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లతో నిఘా
-హనుమాన్ (HANUMAN) బృందాలతో విస్తృత పర్యవేక్షణ చేపట్టండి
-ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి
-అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలను రప్పించండి
-రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలి
-పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకునేలా చర్యలు
-ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఏ.కొండూరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులి కదలికలపై నిరంతరం నిఘా పెడుతూ, ప్రజల భద్రత భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధునాతన సాంకేతికతతోపాటు ఇతర రాష్ట్రాల నిపుణుల సహకారం తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్వీయ పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పులి కదలికలు, దాని సంచార ప్రాంతాలు, ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, పులి సంచార మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలకు చేరవేయాలి. స్థానిక అటవీ శాఖ బృందాలతో సమన్వయం చేసుకుంటూ హనుమాన్ (H.A.N.U.M.A.N) బృందాలతో విస్తృతంగా గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పులి కదలికలను మరింత సమర్థవంతంగా గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను విస్తృతంగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (CWL), ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో చేపట్టే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
పులి సంచరిస్తున్న ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో ప్రజల భద్రతకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, పశువుల కాపరులు, స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అవసరమైన సూచనలు చేయాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక పులి ట్రాకింగ్, రెస్క్యూ బృందాలను రప్పించి ఆపరేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, అనుభవజ్ఞులైన వన్యప్రాణి నిపుణుల సహకారంతో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో ప్రజలకుగానీ, పులికిగానీ ఎలాంటి హాని కలగకూడదని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులి సంరక్షణను కూడా బాధ్యతగా తీసుకుని జాగ్రత్తగా, సమన్వయంతో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా అన్ని చర్యలను, అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
