-స్థానిక ఎన్నికల్లో కూటమి ఐకమత్యమే మహా బలం
-కూటమి నేతలు, శ్రేణులు సమష్టిగా వెళ్లి పని చేయాలి
-నాయకులే కాదు కార్యకర్తలను నిరంతరం సమన్వయం చేయాలి
-క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటరునీ కలవాలి… ఓటు అడగాలి
-జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు
-కాకినాడలో స్థానిక ఎన్నికల సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
‘కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి శ్రేణులన్నీ కలసికట్టుగా పని చేసి, ఆకుల భవాని ని, కూటమి పక్షం కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాల’ని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం కాకినాడ విచ్చేసిన మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించిన సమన్వయ కమిటీతో ప్రత్యేకంగా చర్చించారు. అలాగే కూటమి పక్షాల నేతలతోనూ సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ, ఎలాంటి సమస్యలున్నా కలిసి పరిష్కరించుకోవాలని, కూటమి నాయకులు సమష్టిగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఈ సందర్భంగా నాయకులు మనోహర్ కి వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ.. “స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఈ స్ఫూర్తిని కొనసాగించేలా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన జెండాను అఖండ మెజారిటీతో ఎగిరేలా చేయాలి. కాకినాడ ప్రాంతం అంటే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అమితమైన అభిమానం. ఆయన ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కాకినాడ ఆయన సొంత జిల్లా లాంటిది. కాకినాడ నగరపాలక సంస్థలో జనసేన విజయం ఒక ప్రభంజనంలా నిలిచేలా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని పనిచేయాలి. కూటమిలోని మూడు పార్టీలు నిత్యం చర్చించుకుని సమన్వయంతో ముందుకు సాగితే విజయం చాలా సులభం. ఇటీవల జరిగిన మొదటి దశ ఎన్నికల్లోను ఇది పూర్తిగా కనిపించింది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుంటే, చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. నాయకుల సఖ్యతతో పాటు కార్యకర్తల మధ్య కూడా సమన్వయం చాలా అవసరం.
అందరికీ గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. కొందరికి ముందు అవకాశాలు రావచ్చు.. మరికొందరికి తర్వాత రావచ్చు. కానీ ప్రతి ఒక్కరికి తగిన బాధ్యత అప్పగించేలా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు. పార్టీ ఇచ్చే ప్రతి బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించేలా కృషి చేయాలి. క్షేత్రస్థాయిలో
ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓటు అభ్యర్థించండి. స్థానిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజెప్పండి.
కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు వివరించండి
కూటమి ప్రభుత్వంలో జరిగిన మేలు ప్రజలకు వివరించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన వేదికగా ఉపయోగపడతాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలిసేటప్పుడు వారికి ప్రభుత్వం వల్ల కలిగిన మేలు ప్రయోజనాలను అర్థమయ్యేలా చెప్పండి. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన తీరు వల్ల రాష్ట్రం అభివృద్ధిపరంగా ముందుకు వెళుతున్న తీరును ఓటర్లకు తెలియజెప్పండి. సంక్షేమం ఏ మాత్రం తగ్గకుండా మరిన్ని కొత్త పథకాలతో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న సరికొత్త పంథాను వివరించండి. నగర సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోండి. ఓటరు అడిగిన ప్రతి ప్రశ్నకు తప్పనిసరిగా వివరణాత్మక సమాధానం ఉండాలి. వారిని పాలనలో భాగస్వామ్యం చేసేలా మాట్లాడాలి. చిన్నచిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చొరవ తీసుకోండి. మూడు పార్టీల కార్యకర్తలతో నిరంతర సమావేశాలు నిర్వహిస్తూ, కాకినాడ లో మరోసారి కూటమి ఐక్యతను పెంపొందించేలా విజయం సాధించాలి” అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు, కాకినాడ జెడ్పీ చైర్మన్ డా.బుర్రా దివ్య సునీత రాజ్, కూటమి పార్టీ నేతలు చిక్కాల రామచంద్ర రావు, తోట సుధీర్, వేగుళ్ల లీలాకృష్ణ, తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.
