నవంబర్ 23న జీఎంసీ ప్రత్యేక సమావేశం

-మేయర్, 76 మంది వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం – డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ప్రత్యేక సమావేశం సోమవారం, నవంబర్ 23న ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జీవో ఎంఎస్ నంబర్ 273, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (తేదీ: 02-11-2026), రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రాధికార సంస్థ, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ అధీకృతం చేసిన మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో 76 మంది వార్డు సభ్యులు, మేయర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 8 మంది పదవీరీత్యా సభ్యులు కలిపి మొత్తం 85 మందికి ఓటు హక్కు ఉంటుందని వివరించారు. సమావేశం నిర్వహించడానికి కనీసం 43 మంది సభ్యుల హాజరు తప్పనిసరని తెలిపారు.

ఉదయం 11 గంటలకు సభ్యుల హాజరు సంఖ్యను నిర్ధారించిన అనంతరం తొలుత నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ వెంటనే 76 మంది వార్డు సభ్యులు సామూహికంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. అనంతరం రాజకీయ పార్టీల విప్‌ల ప్రకటన తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారని తెలిపారు.

ప్రత్యక్షంగా ఎన్నికైన వార్డు సభ్యులు చేతులెత్తే పద్ధతిలో తమ ఓటును తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదించడంతో పాటు మరొక సభ్యుడు బలపరచాల్సి ఉంటుందని వివరించారు. ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉంటే ఓటింగ్ నిర్వహించకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అధ్యక్షత వహించే అధికారి మేయర్‌ను వేదికపైకి ఆహ్వానించి, నూతన డిప్యూటీ మేయర్‌కు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారని చెప్పారు.

సమావేశానికి సంబంధించి సమయాల వివరాలను కమిషనర్ వెల్లడించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే సభ్యుల గుర్తింపు కార్డులను పరిశీలించి, కౌన్సిల్ మందిరంలోకి అనుమతించి హాజరు నమోదు చేస్తారని తెలిపారు. ఫారం-ఎ, ఫారం-బి, విప్ ప్రతులను సమర్పించేందుకు ఉదయం 10 గంటల వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 11:05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు, 11:25 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12:10 గంటల కల్లా సమావేశం ముగిసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

సమావేశం నిర్వహణ కోసం కౌన్సిల్ మందిరం లోపల, వెలుపల పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ వివరించారు. మందిరంలో మొత్తం 88 సీట్లను సిద్ధం చేశామని, ముందు వరుసలో మేయర్, పదవీరీత్యా సభ్యులకు స్థానాలు కేటాయించామని తెలిపారు. రాజకీయ పార్టీలకు ప్రత్యేక విభాగాలు, వివరాల ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల కోసం బారికేడ్లతో ప్రత్యేక స్థలాన్ని కేటాయించామని చెప్పారు.

కౌన్సిల్ మందిరం చుట్టూ పోలీసు బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేశామని, అనుమతి పత్రాలు కలిగిన నగరపాలక సంస్థ సభ్యులకు మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సమావేశంలో జరిగే మొత్తం ప్రక్రియను చిత్రీకరించనున్నట్లు తెలిపారు.

సభ్యులందరూ సోమవారం ఉదయం 9 గంటలకల్లా గుర్తింపు కార్డులతో కౌన్సిల్ మందిరానికి చేరుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సమావేశం ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పోలీసు, నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని కోరారు.