పి.బి. సిద్ధార్థలో రచయితతో ముఖాముఖిలో మహేశ్ విద్మహీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సంకల్పం కల్పవృక్షం అయితే నమ్మకం ఐరావతం అని, దేనినైనా విశ్వాసంతో జయించాలని యువ రచయిత మహేశ్ విద్మహి అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రంథాలయ విభాగం మంగళవారం ఉదయం వెబినార్ హాలులో నిర్వహించిన రచయితతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను రాసిన “మనకీ ఓ కృష్ణుడు దొరకాలి”  నవల బాగా అమ్ముడుపోయిందని, యువత నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఏదైనా స్వీకరించాలని, ఏ అవకాశం వదలవద్దని, ఈ లోకంలో కష్టం లేనివారు లేరని, కష్టకాలంలో నమ్మకం కోల్పోకుండా జీవితాన్ని ముందుకు కొనసాగించాలన్నారు. విద్యార్థులు అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాలని, సృజనతోనే భవిష్యత్ ముడిపడి వుందన్నారు. ప్రయత్నం కొనసాగించాలని, యుద్ధంలో ఓటమికి కూడా విలువ ఉండాలని, ఊహలు, విఫల ఆలోచనలు సరికాదన్నారు. గీతాసారం అందిపుచ్చుకుని ఫలితం ఆశించకుండా పనిచేయాలని, చేసిన సాయం తిరిగి వస్తుందన్నారు. ఒత్తిడి లేకుండా చదవాలని, తన మీద తనకు ఏ వ్యక్తికైనా నమ్మకం ఉండాలన్నారు. నిర్భయంగా ఉండాలన్నారు. ప్రేమ మాత్రమే పెంచుకోకుండా బాధ్యత కూడా నిర్వర్తించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డా. మేకా రమేశ్ మాట్లాడుతూ సాహిత్య సృజన చేసే విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ విద్యార్థులు జ్ఞానం పెంచుకోవాలని, జెన్ జీ  పాతతరం నుండి  మౌలిక విలువలు నేర్చుకోవాలన్నారు. డీన్ ఆచార్య రాజేశ్ సి.జంపాల మాట్లాడుతూ ఏఐ సహకారంతో కవిత్వం అల్లడం, కథలు రాయటం చేసే  వెసులుబాటు వచ్చినప్పటికీ మనసులను అర్ధం చేసుకుంటూ చేసే మానవ సాహిత్యసృజన ముందు కృత్రిమ మేధ మనగలగదన్నారు. మనకీ ఓ కృష్ణుడు దొరకాలి నవలను బీఎస్సీ కెమిస్ట్రీ రెండో సంవత్సరం విద్యార్థిని టి. భువనశ్రీ,, బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని పి.బి. లక్ష్మీప్రియ సమీక్షిస్తూ మాట్లాడారు. గ్రంథాలయ వారోత్సవాల పోటీల్లో గెలుపొందిన పలువురికి పుస్తకాలను ముఖ్య అతిథి మహేశ్ అందచేశారు. అనంతరం రచయిత మహేశ్  విద్మహీని ఘనంగా సత్కరించారు. గ్రంథాలయ విభాగాధికారిణి డా. వాణిశ్రీ, తెలుగు విభాగాధిపతి డాక్టర్ సశ్రీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.