కొండపల్లి బొమ్మల కళకు పూర్వవైభవం తెస్తాం

-420 మంది కళాకారులకు ప్రయోజనం.. రూ.20 లక్షలతో నీతి ఆయోగ్ ప్రత్యేక ప్రాజెక్టు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కొండపల్లి సంప్రదాయ చెక్కబొమ్మల కళకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు కళాకారులకు మెరుగైన ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం (ABP) కింద కొండపల్లి బొమ్మల పునరుజ్జీవనం, ప్రోత్సాహానికి రూ.20 లక్షల ప్రాజెక్టుకు ఇటీవల ఆమోదం లభించడం ఈ దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు.
బుధవారం కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్, సంప్రదాయ చెక్కబొమ్మల తయారీ ప్రక్రియను పరిశీలించారు. కళాకారుల నైపుణ్యాలు, బొమ్మల తయారీలో అనుసరిస్తున్న పద్ధతులు, ఈ కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలపై చర్చించారు.
నీతి ఆయోగ్ ప్రాజెక్టు ద్వారా కొండపల్లి బొమ్మల తయారీపై ఆధారపడిన సుమారు 420 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుందని కలెక్టర్ తెలిపారు. సంప్రదాయ కళా నైపుణ్యాలను పరిరక్షిస్తూనే, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కళాకారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
కొండపల్లి బొమ్మలకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించడం, పర్యావరణహిత ప్యాకేజింగ్‌ను ప్రోత్సహించడం, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ విక్రయాలు, మెరుగైన మార్కెట్ అనుసంధానం వంటి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. తద్వారా కొండపల్లి బొమ్మలకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి డా. కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.