పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలి

-చిన్ననాటి నుంచే ఆసక్తులను గుర్తించి, ఆ దిశగా శిక్షణ కల్పించాలి
-చిన్నారి మల్లిపెద్ది దక్ష కాన్వాస్ పెయింటింగ్, పూసల బ్రాస్లెట్ల తయారీ అభినందనీయం
-భవిష్యత్తులో మంచి ఔత్సాహికవేత్తగా ఎదగాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పిల్లల్లో సహజంగా ఉండే సృజనాత్మకతను గుర్తించి, దానిని వెలికితీసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు.

చిన్ననాటి నుంచే పిల్లలకు ఉన్న ఆసక్తులు, అభిరుచులను గమనించి, వాటికి అనుగుణంగా శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని చిట్టూరి హైస్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న 10 సంవత్సరాల చిన్నారి మల్లిపెద్ది దక్ష బుధవారం తన తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డాక్టర్ జి.లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నిర్వహించిన పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన మెడల్‌ను జిల్లా కలెక్టర్‌కు చూపించడంతో పాటు, తాను స్వయంగా తయారు చేస్తున్న పూసల బ్రాస్లెట్లను ప్రదర్శించారు. కాన్వాస్‌పై పెయింటింగ్ వేయడం, వివిధ రంగులు, పూసలు, ఇతర మెటీరియల్‌తో ఆకర్షణీయమైన బ్రాస్లెట్లను తయారు చేయడంలో దక్ష చూపుతున్న ప్రతిభను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్నారి దక్షను పూసల బ్రాస్లెట్ల తయారీ విధానం, వాటికి ఉపయోగిస్తున్న మెటీరియల్‌ను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు తదితర వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తయారు చేసిన బ్రాస్లెట్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. బ్రాస్లెట్ల తయారీతో పాటు మరింత వినూత్నంగా, సృజనాత్మకంగా ఏయే వస్తువులను తయారు చేయవచ్చో ఆలోచించి, కొత్త ప్రయోగాలు చేయాలని చిన్నారికి సూచించారు. తనలోని ప్రతిభను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సృజనాత్మకత అంతర్గతంగా ఉంటుందని, దానిని గుర్తించి సరైన దిశలో ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ తెలిపారు. పిల్లలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించేందుకు అవసరమైన అవకాశాలు కల్పిస్తే, వారు భవిష్యత్తులో ప్రతిభావంతులుగా ఎదగడమే కాకుండా, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకునే ఔత్సాహికవేత్తలుగా కూడా మారగలరని పేర్కొన్నారు. చిన్నారి దక్షలోని సృజనాత్మకతను గుర్తించి, ఆమెను చిన్ననాటి నుంచే ప్రోత్సహిస్తున్న తల్లి ఎం.శైలజను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. దక్ష భవిష్యత్తులో మరింత ప్రతిభను కనబరిచి, మంచి ఔత్సాహికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చిన్నారి దక్ష తల్లిదండ్రులు ఎం.సుమన్, ఎం.శైలజ, తమ్ముడు ఎం.సూర్య పాల్గొన్నారు.