– ఈసీఐ మార్గదర్శకాల మేరకు ఈవీఎం గోదాము తనిఖీ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే అగ్నిప్రమాద నివారణకు ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాల పనితీరును తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో తనిఖీ వివరాలను నమోదు చేసి సంతకం చేశారు. గోదాము భద్రతకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలను నిరంతరం పాటించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు యేదుపాటి రామయ్య (తెదేపా), మురళీకృష్ణ (ఐఎన్సీ), వై.ఆంజనేయరెడ్డి (వైఎస్ఆర్సీపీ), మురళీకృష్ణ (ఐఎన్సీ) తదితరులు పాల్గొన్నారు.
