మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎన్‌సీసీ క్యాడెట్ల అవగాహన కార్యక్రమం

-సిద్ధార్థ కళాశాలలో నశా ముక్త్ భారత్ ప్రచారం.. స్కిట్‌తో విద్యార్థులకు చైతన్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో 8వ ఆంధ్ర నావల్ యూనిట్ ఎన్‌సీసీ క్యాడెట్లు బుధవారం విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో నశా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఏపీ అండ్ టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న నావల్ సెయిలింగ్ ఎక్స్‌పెడిషన్ (MENU-2026)లో భాగంగా సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (SSCD) కార్యక్రమం కింద ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం గురించి అవగాహన ఉపన్యాసం, నాటిక ద్వారా వివరించారు. స్థానిక ప్రజల్లోనూ మాదకద్రవ్యాల నిర్మూలనపై చైతన్యం కల్పించేందుకు ఎన్‌సీసీ క్యాడెట్లు నుక్కడ్ నాటకాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని 8వ ఆంధ్ర నావల్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ సుజీత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రమేష్, డైరెక్టర్ వేమూరి బాబు రావు, అసోసియేట్ ఎన్‌సీసీ అధికారి వెంకటేష్ ఆకురాతి, అధ్యాపకులు, సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.