అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగుదేశం పార్టీ రూపొందించిన మైటీడీపీ (MyTDP) యాప్‌ను 10 లక్షల మంది కార్యకర్తలు డౌన్లోడ్ చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో అరుదైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఈ విజయం వెనుక కృషి చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మైటీడీపీ యాప్ కేవలం సభ్యత్వ నమోదుకే పరిమితం కాకుండా, పార్టీ నాయకత్వానికి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపును ఇచ్చే శక్తివంతమైన వేదికగా ఈ యాప్ రూపొందిందని తెలిపారు. భారీ స్థాయిలో యాప్ డౌన్లోడ్లు నమోదు కావడం కార్యకర్తల అంకిత భావానికి, సాంకేతిక చైతన్యానికి నిదర్శనమని సీఎం కొనియాడారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ నుంచి ప్రతి కార్యక్రమం యాప్ ద్వారా పార్టీ కి అందుబాటులో ఉంటుందని చంద్రబాబు అన్నారు. పని చేసిన వారిని గుర్తించడం లో ఇలాంటి సాంకేతికతను అధిష్టానం ఉపయోగించు కుంటుందని చంద్రబాబు అన్నారు.
