ప్రపంచ మేయర్ల వేదికలో గుంటూరు మేయర్ లక్ష్మీ అపర్ణ.. ముంబై మేయర్ రీతు రాజేష్‌తో భేటీ

-గుంటూరు ప్రత్యేకతలను అంతర్జాతీయ వేదికపై వివరించిన మేయర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో నవంబర్ 25న ప్రారంభమైన మూడవ ప్రపంచ మేయర్ల వేదిక–2026 అంతర్జాతీయ సదస్సులో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
సదస్సులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేయర్ లక్ష్మీ అపర్ణ ప్రసంగిస్తూ గుంటూరు నగర ప్రత్యేకతలను వివరించారు. గుంటూరు దేశంలోనే మిర్చి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిందని, పొగాకు, పత్తి వ్యాపారాల్లోనూ ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్భాగంగా, రాష్ట్రానికి మధ్యలో ఉన్న గుంటూరు నగరానికి భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముంబై మహానగర మేయర్ రీతు రాజేష్‌తో గుంటూరు మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భేటీ అయ్యారు. ముంబై నగరంలో అమలవుతున్న ఆధునిక మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, నగర పాలనలో అనుసరిస్తున్న విధానాల గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా హాజరైన మేయర్లు, నగర ప్రముఖులు, విధాన నిర్ణేతలు, పట్టణాభివృద్ధి నిపుణులతో కలిసి 2047 నాటికి నగరాల పునరాకృతి, నగరాల మధ్య పరస్పర సహకారం, కృత్రిమ మేధ ఆధారిత పట్టణ పాలన, ప్రజాకేంద్రీకృత నగరాల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ, వనరుల సమర్థ వినియోగం, ప్రపంచ పెట్టుబడులతో స్థానిక అభివృద్ధి వంటి అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
సుస్థిరమైన, సమగ్ర, విపత్తులను తట్టుకునే శక్తి కలిగిన నగరాల నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విధానాలను పంచుకునేందుకు ఈ సదస్సు దోహదపడుతోంది. నగర పాలన, పట్టణాభివృద్ధిలో జాతీయ, అంతర్జాతీయ సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ప్రతినిధులు పేర్కొన్నారు.