విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“వికసిత్ భారత్ కేవలం ప్రభుత్వం లక్ష్యం మాత్రమే కాదు. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. నేటి విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తు నిర్మాతలు” అని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం పేర్కొన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలైన విద్యార్థులకు శుక్రవారం ఉదయం బెంజి సర్కిల్లోని నాస్తిక కేంద్రం ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన విద్యార్ధులని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవడంతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణ, సేవాభావం, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని సందేశమిచ్చారు. యువతలో సామాజిక బాధ్యతను, దేశాభివృద్ధి పట్ల నిబద్ధతను పెంపొందించడమే రెడ్ క్రాస్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, చిత్రలేఖన పోటీలలో ప్రతిభ కనబరిచిన 12 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు వికసిత్ భారత్ అనే అంశంపై నిర్వహించడంతో విద్యార్థులు తమ చిత్రాల ద్వారా 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే తమ ఆకాంక్షలను, సృజనాత్మక ఆలోచనలను అద్భుతంగా వ్యక్తపరిచారు. బహుమతుల ప్రదానోత్సవానికి ముందు బాలల దినోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియో గీతాన్ని, అలాగే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా శాఖ రూపొందించిన వికసిత్ భారత్ సందేశాత్మక వీడియోను ప్రదర్శించారు. ఈ రెండు వీడియోలు విద్యార్థులను, సభకు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వికసిత్ భారత్ వీడియో సందేశం విద్యార్థులలో దేశభక్తి, దేశాభివృద్ధి పట్ల బాధ్యత, సామాజిక స్పృహ మరియు దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని కలిగించింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వెలగ జోషి, కార్యదర్శి ఇ. చిట్టిబాబు, యూత్ రెడ్‌క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. రమేష్, జూనియర్ రెడ్‌క్రాస్ కోఆర్డినేటర్ ఎన్. జోసెఫ్ జోషి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ డి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులదే కీలకపాత్ర… : డాక్టర్ సమరం
