-గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచన
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి సర్పంచుల అభినందన సభలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, టిడిపి నేత, పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబుతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరై విజయం సాధించిన కూటమి సర్పంచులను అభినందించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని చూరగొని విజయం సాధించిన సర్పంచులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ సహకారంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
