-పాత సభ్యత్వాల పునరుద్ధరణకు రూ.150
-కొత్త సభ్యత్వానికి రూ.250
-సంయుక్త కార్యవర్గ సమావేశంలో నిర్ణయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన సంయుక్త కార్యవర్గ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, ఉపాధ్యక్షుడు చావా రవి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్త సభ్యత్వ రుసుమును రూ.250గా, పాత సభ్యత్వాల పునరుద్ధరణ రుసుమును రూ.150గా నిర్ణయించారు.
ప్రస్తుత సభ్యులందరూ తమ సభ్యత్వాలను పునరుద్ధరించుకోవాలని, కొత్తగా చేరాలనుకునే పాత్రికేయులకు సమాచారం అందించి సభ్యత్వాలు పొందేలా సహకరించాలని నిర్వాహకులు కోరారు. కొత్తగా సభ్యత్వం తీసుకునే వారు ఇతర పాత్రికేయ సంఘాల్లో సభ్యులుగా ఉండకూడదని, అందుకు సంబంధించి దరఖాస్తుతో పాటు హామీ పత్రం సమర్పించాలని తెలిపారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయవాడ యూనిట్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు విజ్ఞప్తి చేశారు.
