విజయవాడలో ఘనంగా మెగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం

-అదనపు సీజీసీఏ డాక్టర్ శిఖా మాథుర్ ప్రారంభం.. 800 మంది పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పెన్షనర్లకు జీవన ప్రమాణ పత్రాల సమర్పణను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5.0 శిబిరం శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ (సీజీసీఏ) కార్యాలయ అదనపు సీజీసీఏ డాక్టర్ శిఖా మాథుర్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో టెలికాం, డిజిటల్ రంగాల అభివృద్ధికి పెన్షనర్లు అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘నేషన్ ఫస్ట్ – సిటిజన్ ఫస్ట్’ స్ఫూర్తితో పెన్షనర్లకు సులభతరమైన సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంపన్ 2.0 పోర్టల్‌ను మరింత సులభతరం చేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లో చాట్‌బాట్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ సేవలు వినియోగించేటప్పుడు సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ శిబిరానికి టెలికాం, తపాలా, ఆకాశవాణి, దూరదర్శన్, రైల్వే, ఆదాయపు పన్ను, అకౌంటెంట్ జనరల్, సీపీడబ్ల్యూడీ, కస్టమ్స్, జీఎస్టీ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 800 మంది పెన్షనర్లు హాజరై డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు పొందారు.
పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు ఆయుర్వేదం, సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ సర్వీసెస్ బుక్‌ను ఆవిష్కరించి, పలువురు పెన్షనర్లను ఘనంగా సత్కరించారు.
2026 నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు 2,000కు పైగా ఉపవిభాగ కేంద్రాల్లో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పెన్షనర్లు సులభంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేలా చర్యలు చేపట్టారు. ఈసారి 100 శాతం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ లక్ష్యంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో ఏపీ ప్రిన్సిపల్ సీసీఏ ఎం. ఇందు మాధవి, జాయింట్ సీసీఏ సందీప్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీసీఏ రవీజా, డీఓపీపీడబ్ల్యూ డైరెక్టర్ ప్రమోద్ కుమార్, ఎస్. తారాచంద్, బీఎస్ఎన్ఎల్, ఎల్ఎస్ఏ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు.