-విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ వంగవీటి రాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ వంగవీటి రాధ శనివారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సమావేశ గదిలో ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గౌరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలో పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ, దోమల నివారణ చర్యలు, పారిశుధ్య సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై మేయర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం చేపడుతున్న కార్యక్రమాలు, నగరంలో పారిశుధ్య నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ద్వారా అమలు చేస్తున్న చర్యలను చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గౌరీ మేయర్‌కు వివరించారు.
అనంతరం మేయర్ వంగవీటి రాధ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం సమిష్టి బాధ్యత అని, ఇందులో ప్రజారోగ్య విభాగం కీలక పాత్ర పోషించాలని అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజారోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే కార్పొరేటర్లతో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లందరితో సమానంగా సమన్వయం చేసుకుంటూ వారి ద్వారా అందే ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని మేయర్ సూచించారు. ఏ డివిజన్‌లోనైనా పారిశుధ్యం, దోమల బెడద, డ్రైనేజీ, చెత్త తొలగింపు లేదా ఇతర ప్రజారోగ్య సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత సంబంధిత కార్పొరేటర్‌కు సమాచారం అందించే విధంగా అధికారులు వ్యవహరించాలని తెలిపారు.
అలాగే, నగరంలో ఒక నెల రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహించనున్న “మిషన్ హెల్దీ విజయవాడ” కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కేవలం నెల రోజుల పారిశుధ్య చర్యలకే పరిమితం చేయకుండా, నగరంలో పారిశుధ్య నిర్వహణ తీరులో కీలకమైన మార్పు తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని అన్నారు. ప్రతి డివిజన్లో పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రజారోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడం, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయడం, పరిశుభ్రమైన పరిసరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లను కూడా భాగస్వాములను చేస్తూ ప్రజల సహకారంతో ఆరోగ్యకరమైన విజయవాడ నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి వివక్షకు తావులేకుండా నగరంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఒకే బృందంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, సమిష్టి కృషితో విజయవాడ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని మేయర్ ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ గోపాల నాయక్, డాక్టర్ అన్నపూర్ణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
