దసరా ఉత్సవాల అనంతరం ఘాట్లలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, పున్నమి ఘాట్ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో పారిశుధ్య కార్మికులు ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. ఉత్సవాల సమయంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సిబ్బంది సమన్వయంతో సేవలు అందించారని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్ల ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు.

దసరా ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో ఘాట్ల ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందించేలా పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.

అనంతరం భవానీపురంలోని పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న నేషనల్ సరస్ ఉత్సవ్‌ను కమిషనర్ సందర్శించారు. ఉత్సవ ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల పరిశుభ్రత, పరిసరాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవంలో పాల్గొనే లఖ్‌పతి దీదీలకు అవసరమైన ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

సరస్ ఉత్సవ్‌ను సందర్శించే ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేలా పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు.