అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
బ్రాహ్మణుల ఆర్థిక స్థిరత్వం, వృత్తి గౌరవం, సామాజిక ప్రాతినిధ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తలో సుమారు 80 శాతం తొలగించినట్లు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. బ్రాహ్మణ సంక్షేమంలో భాగంగా దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించడం, చిన్న దేవాలయాల అర్చకులకు కనీస నెలవారీ వేతనాన్ని రూ.15,000కు పెంచేందుకు చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. ధూపదీప నైవేద్య పథకం కింద ఆర్థిక సాయాన్ని పెంచడంతో పాటు, వేద విద్యను అభ్యసించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
దేవాలయాల్లో ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అపరకర్మలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ధార్మిక సంస్థలతో సమన్వయం ద్వారా సంప్రదాయాలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యతలని చెప్పారు. బుడమేరు వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాలయాల నుంచి అర్చకులు, వేద విద్యార్థుల నుంచి పురోహితుల వరకు బ్రాహ్మణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని బుచ్చి రామ్ ప్రసాద్ స్పష్టం చేశారు.
