Breaking News

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పున:జన్మ ప్రసాధించే వైద్యుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు నగరంలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో పలువురు వైద్యులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రముఖ వైద్యులు, స్వాతంత్య్ర సమరయోధులు, భారత రత్న డా. బిధాన్‌ చంద్రరాయ్‌ ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం రోజున ప్రతీ సంవత్సరం జూలై 1వ తేదిన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సరైన సమయంలో వైద్య చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబాలలో ఆనందాన్ని నింపుతున్న ప్రతి వైద్యుడు ప్రత్యక్ష దైవంతో సమానమన్నారు. వైద్యులు విద్యార్థి దశ నుండే వైద్యమే శ్వాసగా గడుపుతారని రోగులకు ఎటువంటి వైద్యం అందించాలనే ఆలోచనతోనే ఉంటారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ వారు ఎంచుకున్న వృత్తి లో విధులు నిర్వర్తించేందుకు నిర్ధిష్టమైన సమయం ఉంటుందని, వైద్యులకు మాత్రం అలాంటి వెసులుబాటు ఉండదన్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇరవైనాలుగు గంటలూ సేవలు అందించేదుకు సిద్ధంగా ఉంటారన్నారు. వైద్యులు తన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో రోగికి వైద్య సహాయం అందించేందుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారన్నారు. సకాలంలో వైద్య సహాయం అందించి, ప్రాణాపాయం నుండి రోగి ప్రాణాలను కాపాడతారన్నారు. వైద్య వృత్తికే జీవితాన్ని అంకితం చేసి సేవలందిస్తున్న వైద్యులను ప్రత్యక్ష దైవాలతో సమానంగా భావించి సత్కరించుకోడం అదృష్ఠంగా భావించాలన్నారు. ప్రభుత్వ వైద్యులు నిత్యం ఎంతో మంది నిరుపేదలకు వైద్యసహాయం అందిస్తూ ప్రభుత్వ ఆశయాన్ని నెరవేరుస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో వైద్యులు వారి ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలు అందించడం వల్లనే వేలాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వై యస్‌ ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ లు ఏర్పాటు చేసి కార్పొరేట్‌ స్థాయి లో మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునికమైన వైద్య పరికరాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచటం జరిగిందని ప్రతి ఒక్కరికీ కార్పొరేట్‌ వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్య మన్నారు. ప్రభుత్వ వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోందని గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సైతం మెరుగైన వైద్య సహాయం అందించాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క వైద్యుడు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలను పొందాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా. యం సుహాసిని, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరిండెంట్‌, ఆర్థోపెటిక్‌ డా. డి వెంకటేష్‌, నెప్రాలజిస్ట్‌ డా. సిహెచ్‌. నాగేశ్వరరావు, జనరల్‌ మెడిసెన్‌ డా. కె. సుధాకర్‌, పెథాలజిస్ట్‌ డా. ఇ. షర్మిల, డిసిహెచ్‌ఎస్‌ డా. జి. స్వప్న, డా. కె. శ్రీలత, డా. మోతిబాబు, డా. పి నవీన్‌, డా. పి సమీరా, డా. సిహెచ్‌ కల్యాణ్‌ చక్రవర్తి, డా. హరిచందనలను కలెక్టర్‌ డిల్లీరావు దుశ్శాలువ, మెమోంటోలు, సర్టిఫికేట్లతో ఘనంగా సన్మానించారు.

Check Also

ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *