-ఓటర్లలో మత విభజన కోసం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
-జేపీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
-మనువాదాన్ని తెచ్చే ప్రయత్నం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత మస్తాన్ వలి
-వక్ఫ్ బిల్లును పార్లమెంటులో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించాలి: మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్
-లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లు నిరసన సభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని ముస్లిం సంఘాలు, జమాత్‌ల మద్దతుతో నిరసన సభ జరిగింది. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లులో అత్యంత ప్రమాదకరమైన సవరణలు ఉన్నాయన్నారు. ఓటర్లలో మత విభజన తీసుకువచ్చేందుకే ఈ బిల్లు తీసుకువస్తున్నారని స్పష్టం చేశారు. టీటీడీలో హిందూవేతరులు ఉండకూడదని ఒకవైపు చెపుతూ మరో వైపు వక్ఫ్‌బోర్డులో హిందువులు ఉండాలని పేర్కొనటం దుర్మార్గం అన్నారు. జేపీసీ నివేదిక పార్లమెంటుకి రాకముందే ఆ బిల్లును ఆమోదించుకుంటామని హోం మంత్రి అమిత్ షా తొందరపడుతున్నారని విమర్శించారు. గతంలో సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరితే తిప్పికొట్టిన పాలకులు ఇప్పుడు సచార్ కమిటీ సూచించినట్లు చేస్తున్నామనటం సందేహాలకు తావిస్తుందన్నారు. వక్ఫ్‌బిల్లు పార్లమెంటులో వీగిపోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్‌కుమార్ ముందుకు రావాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అఘోరి ఇద్దరూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ విధానాలు హిందువులందరికీ అనుకూలం కాదన్నారు. కులాల మధ్య విబేధాలు సృషిస్తుందన్నారు. ఆలయాలు, మసీదులు, చర్చ్‌ల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వక్ఫ్ బిల్లును పార్లమెంటులో, బయట సీపీఎం వ్యతిరేకించిందని గుర్తు చేశారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ముస్లిమేతరులు మాట్లాడిన వాటిని పరిగణలోకి తీసుకోవటం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి జరుగుతుందని ఆందోళన చెందే పవన్ కల్యాణ్ మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏపీలో ఒకవిధంగా, ఢల్లీిలో మరో విధంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత షేక్.మస్తాన్ వలి మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు మోదీ ప్రభుత్వం సవరణల బిల్లు తీసుకువచ్చిందన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా గోద్రా అల్లర్లు జరిగితే ఆ తరువాత వచ్చే ఎన్నికల వరకు ఆ ఘటనను మర్చిపోకుండా చేసినా ప్రజలు సమన్వయంతో ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లుకు 40 సవరణలు చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ సూచించిందన్నారు. ముస్లిం సమాజాన్ని భయబ్రాంతులకు గురి చేసేందుకు సీఏఏ, ఎన్ఆర్సీ, వక్ఫ్ సవరణలు వంటి చట్టాలు తీసుకువస్తున్నారని చెప్పారు. దేశంలో మనువాదాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
సభకు అధ్యక్షత వహించిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పరిపాలన చేస్తున్నారని, వారికి అనుకూలమైన తీర్పులు ఇప్పించుకుని రామమందిరం నిర్మించారని, కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేశారని చెప్పారు. రామ మందిరం నిర్మించిన నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయిందని, అలాగే కశ్మీర్ ఎన్నికల్లో అధికారంలోకి రాలేదన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ సంఘటల ద్వారా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పలస్తీనాలో ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవ దేశమైన ఇజ్రాయేల్‌కి మద్దతు ఇస్తున్న మోదీ క్రైస్తవులకు అనుకూలంగా ఉన్నట్లు కాదని, మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు చేస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పుడు ముస్లింలు, తరువాత క్రైస్తవులు, ఆ తరువాత ఇతర మతాలు ఇలా జరుగూనే ఉంటాయని హెచ్చరించారు.
మాజీ పార్లమెంటు సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఉమ్మడి జాబితాలో ఉన్నందున్న రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉందన్నారు. హిందువుల మంగళసూత్రాలు తీసి ముస్లింలకు ఇస్తారని, ముస్లిం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని పాలకులు మాట్లాడుతుంటే ఎన్నికల కమీషన్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. చేగువేరాని ఆదర్శంగా భావించినట్లు చెప్పిన రాజకీయ నాయకుడు సనాతన ధర్మం గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. పరమత సహనం గురించి స్వామి వివేకానంద చేసిన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ విని తెలుసుకోవాలని సూచించారు.
జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు రఫీక్ అహ్మద్, అహెహదీజ్ జమాత్ రాష్ట్ర అధ్యక్షుడు ఫజ్లుర్ రహమాన్ ఉమ్రి, సున్నతుల్ జమాత్ అధ్యక్షుడు ముక్తియార్, మజ్లిసుల్ ఉలేమా అధ్యక్షుడు ముఫ్తి యూనఫ్, ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడు జాఫర్ పులి, లౌకిక పరిరక్షణ వేదిక విజయవాడ అర్బన్ కన్వీనర్ అబ్దుల్ మతీన్, ముస్లిం జేసీ కన్వీనర్ షేక్.మునీర్ అహ్మద్, పైగామ్ ఇన్సానియాత్ అధ్యఓఉడు మౌలానా మక్బుల్ అహ్మద్ సద్వి, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు చిష్టి, ప్రముఖ న్యాయవాది సలీమ్, సామాజిక, రాజ్యాంగ అధ్యాయన కేంద్రం నిర్వాహకులు ఆరిఫ్ మహ్మద్ తదితరులు ప్రసంగించారు.
అతిథులను ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అఫ్సర్ సభ ఉద్ధేశాన్ని వివరించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు షేక్ బాజీ సయీద్ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్ అభ్యుదయ గీతాలు ఆలపించారు. విజయవాడ ఆటోగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కోశాధికారి ఎస్ఎస్ హూసేనీ(బాబా) వందన సమర్పణ చేశారు.
Prajavartha Online Telugu News