ఘనంగా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక శివాలయం సెంటర్ వద్ద గల వైఎస్సార్‌సీపీ నాయకులు కోనకళ్ల విద్యాధరరావు గారి నివాసంలో ఆదివారం సాయంత్రం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సమావేశానికి మాజీ మంత్రి, పశ్చిమ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మండేపూడి చటర్జీ, 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సంక పరమేశ్వరరావు, 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పువ్వాడ చిన్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నగర సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్న వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిని, కార్పొరేటర్ అభ్యర్థులైన మండేపూడి చటర్జీ, సంక పరమేశ్వరరావు, పువ్వాడ చిన్న వెంకటేశ్వరరావులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
​ఆర్యవైశ్యుల ఆర్థిక, సామాజిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా చూశామన్నారు. అలాగే ఆర్యవైశ్యులకు సముచిత రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు పలు డైరెక్టర్ పదవులు, దేవాదాయ శాఖ పాలక మండళ్లు మరియు ప్రముఖ ఆలయ ట్రస్ట్‌ బోర్డుల్లో గౌరవప్రదమైన ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు.
​ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించామని, జయంతి మరియు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేశామని వెలంపల్లి వివరించారు.

​కుల, మత వివక్ష లేకుండా అమలు చేసిన జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన వంటి నవరత్నాలు పథకాల ద్వారా ఆర్యవైశ్యులలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, మహిళలకు ఆర్థిక భరోసా లభించిందని తెలిపారు. ఈబీసీ కోటా ద్వారా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడంతో పేద ఆర్యవైశ్య యువతకు విద్య, ఉద్యోగాల్లో ఎంతో మేలు చేకూరిందన్నారు. అదేవిధంగా చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలను ‘జగనన్న తోడు’ ద్వారా అందించామని గుర్తు చేశారు.
​ఈ విధంగా ఆర్యవైశ్య సమాజానికి రాజకీయ గుర్తింపుతో పాటు సంక్షేమ పథకాలు, విద్య, వ్యాపార రంగాల్లో సంపూర్ణ మద్దతు అందించిన వైఎస్సార్‌సీపీని ఆదరించి, పార్టీ బలపరిచిన మేయర్ మరియు కార్పొరేటర్ అభ్యర్థులందరినీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక ఆర్యవైశ్య ప్రముఖులు, పాల్గొన్నారు.