రాష్ట్రంలో రామరాజ్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-వాల్మీకి రామాయణమే ఆదర్శంగా కూటమి పాలన
-అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు
-వాల్మీకి, బోయలకు ప్రాధాన్యమిస్తున్న కూటమి
-స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 ఎంపీపీ స్థానాలు, పలు ఎంపీటీసీ స్థానాలు కేటాయింపు : మంత్రి సవిత
-పెనుకొండలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
-వాల్మీకి చిత్రపటానికి మంత్రి సవిత ఘన నివాళులు

పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త:
వాల్మీకి మహార్షి స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో రామరాజ్యం నడుస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వాల్మీకీలు, బోయల రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు సీఎం చంద్రబాబునాయుడుతో సాధ్యమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వాల్మీకి, బోయలకు అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి మంత్రి సవిత పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం చారిత్రాత్మకమైనదని, ప్రపంచ ప్రఖ్యాత కాంచిందని తెలిపారు. భార్యా భర్తల బంధానికి, అన్నా దమ్ముల అనుబంధానికి, కుటుంబా బాంధవ్యాలకు రామాయణం ఎంతో స్ఫూర్తినిస్తోందన్నారు. రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో రామరాజ్యం నడుస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోరుగుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. బీసీల ఉన్నతికి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు అన్నింటా బీసీలకు అగ్రతాంబూలం వేస్తున్నారన్నారు. బీసీల్లో భాగమైన వాల్మీకీలు, బోయలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ గుర్తింపునిచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఎందరో వాల్మీకి, బోయ నాయకులకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అవకాశమిచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ ది, సీఎం చంద్రబాబుదేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. సోమందేపల్లి, గోరంట్ల ఎంపీపీ స్థానాలతో పాటు పలు ఎంపీటీసీ స్థానాలు, సర్పంచులుగా కేటాయించామన్నారు. పెనుకొండ నియోజక వర్గానికి చెందని వ్యక్తికి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించామన్నారు. వాల్మీకి, బోయల అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. 2017లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ జీవో జారీ చేసిందని మంత్రి సవిత గుర్తు చేశారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబునాయుడిదేనన్నారు. పెనుకొండలో వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే, వాల్మీకి విగ్రహం ఆవిష్కరించనున్నామన్నారు. బోయలు, వాల్మీకీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమి అభ్యర్థులకు వాల్మీకి, బోయ సామాజిక వర్గం అండగా నిలవాలని మంత్రి సవిత కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు నరసింహ రావు, కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, భారీ సంఖ్యలో వాల్మీకి, బోయ సామాజిక వర్గీయులు పాల్గొన్నారు.