అర్న‌బ్‌పై ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధం

-ప్రాణ న‌ష్ట నివార‌ణే ల‌క్ష్యం
-ఆర్టీజీఎస్ నుంచి నింర‌తర ప‌ర్య‌వేక్ష‌ణ
-11 జిల్లాల‌కు ఎన్డీఆర్ ఎఫ్‌, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు
-మ‌త్స్య‌కార ప‌డ‌వ‌ల‌న్నీ తీరానికి చేరిక‌
-రేపు తీర‌ప్రాంత‌ ర‌హ‌దారుల‌పై రాక‌పోక‌లు నిలిపివేత‌
-తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో విద్యాసంస్థ‌ల‌కు రెండు రోజులు సెల‌వు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంవైపు దూసుకొస్తున్న అర్న‌బ్ తుపాన్‌ను ఎదుర్కోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌మైంది. ఎక్క‌డా కూడా ప్రాణ న‌ష్టం, ఆస్తిన‌ష్టం సంభ‌వించ‌కుండా నివారించ‌డ‌మే ల‌క్ష్యంగా యంత్రాంగం ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌తా చ‌ర్య‌లు తీసుకుంటోంది. స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రం నుంచి ఆయా శాఖ‌ల అధికారుల‌తో ఆర్టీజీ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు నిరంత‌ర స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. తుపాన్ ప్ర‌భావి జిల్లాల్లో చేప‌ట్టిన ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త చ‌ర్య‌ల గురించి ఆయా శాఖ‌ల అధికారులు, జిల్లా అధికారుల‌తో నిరంత‌రం మాట్లాడుతూ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. జిల్లాల్లో తీసుకున్న ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త చ‌ర్య‌లు, ఏర్పాట్ల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఆర్టీజీఎస్ అధికారులు వివ‌రిస్తున్నారు. ఆయా శాఖ‌ల మ‌ధ్య ఎక్క‌డా కూడా స‌మ‌న్వ‌లోపం త‌లెల్త‌కుండా చూసుకుంటున్నారు.

11 జిల్లాలకు ఎస్డీఆర్ ఎఫ్‌, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు

తుపాను ప్ర‌భావం కార‌ణంగా ఏర్ప‌డే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎస్‌డీఆర్ ఎఫ్‌, ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాల‌ను త‌ర‌లించారు. లోతట్టు, ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు మంగ‌ళ‌వారం, బుధ‌వారం రెండు రోజులు సెలవు ప్రకటించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 2,460 రెవెన్యూ గ్రామాలు, 92 పట్టణ ప్రాంతాలపై తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు.

1,763 తుపాను షెల్టర్లు గుర్తింపు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 1,763 తుపాను షెల్టర్లను గుర్తించారు. జిల్లా, మండల స్థాయుల్లో మొత్తం 2,907 కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు 3,185 మంది నోడల్ అధికారులను నియమించారు. అలాగే, 2,107 స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పరిధిలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు త‌గు చర్యలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో బీచ్‌లను మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తీరప్రాంత రహదారులపై రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు.

మత్స్యకారుల భద్రతకు ప్రత్యేక చర్యలు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. మత్స్యకారులకు చెందిన 30,043 పడవలను రేవుల్లో నిలిపివేశారు. సముద్రంలోకి వెళ్లకుండా మత్స్యకారులకు అవసరమైన సూచనలు అందిస్తూ వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

వైద్య సేవలు, తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా 2,613 అత్యవసర నీటి ట్యాంకర్లను సిద్ధంగా ఉంచారు. చెట్లు కూలి రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే తొలగించేందుకు అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. రహదారులను త్వరితగతిన పునరుద్ధరించి అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తి నష్టాలను తగ్గించడం, అత్యవసర సేవలను నిరంతరాయంగా అందించడం లక్ష్యంగా ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీజీఎస్‌ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఎం. మాధురి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పి. శ్రీఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.