కూటమి అభ్యర్థులను గెలిపించండి : పట్టాభిరామ్ పిలుపు

-కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్ షో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంగళవారం నగరంలో జరిగిన భారీ రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొని, విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ రోడ్ షోకు ‘ప్రజా సంక్షేమ పర్యటన’గా పేరు పెట్టారు. ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతోపాటు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కె. నాగుల్ మీరా, కూటమి తరఫున పోటీ చేసే కార్పోరేటర్ అభ్యర్థులు పాల్గొన్న ఈ ప్రజా సంక్షేమ పర్యటన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగింది. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పాటుపడే కూటమి అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ప్రచారానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉదయం 10 గంటలకు 33వ డివిజన్ లో ప్రారంభమైన ఈ రోడ్ షో 41వ డివిజన్
సితార సెంటర్ నుంచి మిథిలా నగర్ లోకి ప్రవేశించి చనుమోలు వెంకట్రావ్ ప్లై ఓవర్ వరకు సాగింది. తొలుత ఈ రోడ్ షో 33వ డివిజన్ బాల భాస్కర్ నగర్ మీదుగా స్వాతి సెంటర్ చేరింది. అక్కడ నుంచి 34వ డివిజన్ గాంధీబొమ్మ రోడ్డు నుండి కోళ్ల ఫారం రోడ్డు వరకు, అక్కడి నుండి మానవ మందిర్ రోడ్డు మీదుగా స్వాతి రోడ్డులోకి ప్రవేశించింది. 38వ డివిజన్ లో పీఆర్ కే. బిల్డింగ్ సెంటర్‌కు చేరుకుని, ఆ తర్వాత పాకల ప్రాంత వాసులతో ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇదే క్రమంలో 38,39వ డివిజన్ల ప్రజలను కలిశారు. శివాలయం సెంటర్ నుంచి ప్రియదర్శిని కాలనీ ‘సత్య ఫ్యాన్సీ’ మొదటి రోడ్డు మీదుగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఓటర్లను, స్థానిక ప్రజలను పలకరిస్తూ రోడ్ షో సాగించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో 300, 450 ఎస్.ఎఫ్.టి. కాలనీ రోడ్డు మీదుగా ప్రయాణించి, శ్రీ కృష్ణ మందిర్ రోడ్డు ద్వారా చర్చ్ సెంటర్‌కు చేరుకున్నారు. 41వ డివిజన్ చనుమోలు వెంకట్రావ్ ప్లై ఓవర్ వద్ద ఈ రోడ్ షో ముగించారు.