విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోదీ ప్రభుత్వం అడుగడుగునా మోసగిస్తోందని, అయినా చంద్రబాబు ప్రధాని మోదీ మాయలో పడిపోయారని, జగన్ చేత ధర్నా చేయించింది మోడీనే అని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ అడిగారని, ప్రజలు ఇచ్చారు అంతే అన్నారు. జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కార్పొరేషన్లకు దండిగా నిధులు ఇచ్చి, యువతను ఆదుకుంటున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఇందుకు కారకులెవరో జగన్, చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మోడీ, చంద్రబాబు చెవిలో పువ్వులు పెట్టా రని, అమరావతి, పోలవరం నిర్మాణంకు కేంద్ర బడ్జెట్లో ఒక్క పైసా గ్రాంట్‌గా నిధులు ఇవ్వలేదన్నారు. అమరావతికి 15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం బిజెపి ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి పక్క రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి 7 లక్షల కోట్లు అని ఒకరు, కాదు 13 లక్ష కోట్లు అని మరొకరు చెబుతున్నారని, ఎవరి మాటలు నమ్మాలో జనానికి అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర అప్పులుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పోలవరంపై ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వలన వలసపోతున్నారని, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. దిల్లీ ధర్నా వల్ల మాజీ సీఎం జగన్ అభాసుపాలయ్యారన్నారు. వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిపోయి న కార్పొరేషన్లను టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోందని చింతా మోహన్ ప్రశ్నించారు. నిధులు ఇస్తారా? ఇవ్వరా? టిడిపి ప్రభుత్వ వైఖరి ఏమిటని నిలదీశారు. నిన్న తాను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిశానని, ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి ఏమిటని అడిగితే ఆ అధికారి నోరే కదపలేదన్నారు. రాష్ట్ర విభజన నింద కాంగ్రెస్‌పై మోపడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని, వాటిని చంద్రబాబు ప్రభుత్వం తక్షణం పునరుద్దరించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం తిరుపతిలో ధర్నా చేయబోతున్నామన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …