మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుండి శనివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులు, ఆసుపత్రుల సేవల జిల్లా సమన్వయాధికారులు, జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ నుండి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున కీటక జనిత వ్యాధులు ప్రబలడం, నీరు కలుషితం కావడం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించాలి. భారీ వర్షాల కారణంగా ప్రత్యేకించి దోమలు, ఈగలు వంటి కీటకాలు వృద్ధి చెంది వ్యాధుల్ని వ్యాపించేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నీరు, ఆహారం కూడా కలుషితమవుతాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి.
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ఙి, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్ శాఖల్ని సమన్వయపరుచుకోవడం ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఎటువంటి అత్యవసర పరిస్థితులు నెలకొన్నా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందుకు డిఎంఅండ్ హెచ్వోలే పూర్తి బాధ్యత వహించాలి. ఎటువంటి ఆశ్చర్యకరమైన సంఘటలకు తావులేకుండా సర్వసన్నద్ధంగా ఉండాలి. రాష్ట్రస్థాయి నుండి ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉంటారు. మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై ఎప్పటికప్పుడు స్పందించేలా యంత్రాంగాన్ని ఏర్పరుచుకోవాలి. ఆయా సంఘటనల నేపథ్యాన్ని మీడియాకు వివరించాలి. వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యల్ని, వాస్తవాల్ని తెలియజేయాలి.
నీటి శాంపిళ్ల టెస్టులు నిరంతరమూ కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. నీటి కాలుష్యం ఉన్న చోట్ల ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు సంబంధిత పంచాయతీరాజ్ సెక్రటరీకి రాతపూర్వకంగా సమాచారామివ్వాలి. నీటి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈనెల 28న నిర్వహించే వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా వివిధ రూపాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, సబ్ సెంటర్ల వారీగా హెపటైటిస్ రిస్క్ ఉన్న వారికి స్క్రీనింగ్ చేయాలి. ప్రచార సాధనాలు, కరపత్రాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. ఈనెల 18 నుండి ఆగష్టు 2 వరకు నిర్వహించే లెప్రసీ క్యాంపెయిన్ మెల్లగా సాగుతున్న జిల్లాల్లో ఊపందుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆగష్టు 1నుండి నిర్వహించే ప్రపంచ తల్లి పాల వారోత్సవాలకు సంబంధించి రూపొందించిన ఏడు రకాల పోస్టర్లు, ఫ్లిప్ చార్టుల్ని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక, సబ్ సెంటర్లు, అలాగే మెడికల్ కాలేజీల స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి. తల్లి పాల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలిసేలా ఈ వారోత్సవాల్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి.
ఎన్సీడీ క్లీనిక్‌లు ప్రతిరోజూ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అక్కడికొచ్చిన వారికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి గుర్తింపు సంఖ్యల్ని (అభా ఐడిలు) క్రియేట్ చేయాలి. తద్వారా నూటికి నూరు శాతం అభా ఐడిలు సృష్టించే రాష్ట్రంగా ఏపీ ముందుండేలా ఎన్సీడీ క్లీనిక్‌లను ఉపయోగించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆరోగ్య శిబిరాల్ని(ఆరోగ్య సివిర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. నెలలో నాలుగో శనివారం నాడు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలి. అన్ని సామాజిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రాల్లో నెలలో నాలుగో శనివారం తప్పనిసరిగా ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిథిలో మెడికల్ ఆఫీసర్లు సంబంధిత అధికారులతో కలిసి హాస్టళ్లను సందర్శించాలి. ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు చర్యలు తీసుకునేలా ఉండాలి. ఏమాత్రం అలసత్వం వహించకూడదు. అలాగే కాలానుగుణ వ్యాధుల విషయంలో కూడా డిఎంహెచ్వోలు సమర్థవంతంగా పనిచేయాలి. ప్రతిభ ఆధారంగానే డిఎంహెచ్వోలకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆ దిశగా పనితీరును మెరుగుపర్చుకోవాలి.
డిఎంహెచ్వోలు, డిప్యూటీ డిఎంహెచ్వోలు పని విభజన చేసుకుని మంచి వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. తద్వారా మెరుగైన ఫలితాల్ని సాధించాలి. పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. సెంకడరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అట్టాడ సిరి ఐఎఎస్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం ఏడీ డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి, ఏడీలు, డీడీలు,పీవోలు, వర్చువల్‌గా నేషనల్ హెల్త్ మిషన్ సిఎఓ ఆర్.గణపతిరావు వీసీలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News