Breaking News

ఆధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి


– ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది
– యూనివర్సల్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు వై. సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్
– నిష్ణాతులైన వైద్యులు, ప్రపంచ స్థాయి సాంకేతిక సంపత్తితో యూనివర్సల్ హాస్పిటల్స్
– రాష్ట్రంలో తొలిసారిగా ‘నీ ప్లస్’ అగ్‌మెంటెడ్ రియాలిటీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక వైద్య సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిష్ణాతులైన వైద్యులు, ప్రపంచ స్థాయి సాంకేతిక సంపత్తితో తీర్చిదిద్దిన యూనివర్సల్ హాస్పిటల్స్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ తో కలసి ఆయన ప్రారంభించారు. స్థానిక దానవాయిపేట మెయిన్ రోడ్డులో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బి. బలరామకృష్ణ, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు తదితర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని వెల్లడించారు. అనంతరం, మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పేద ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెరుగైన వైద్య చికిత్సల కోసం పెద్ద పెద్ద నగరాల్లోని ఆసుపత్రులకు తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా, అత్యంత ఆధునికంగా యూనివర్సల్ హాస్పిటల్స్ ను ప్రారంభించడం ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు చేస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. యూనివర్సల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి రాజేంద్రబాబు మాట్లాడుతూ, అత్యంత అనుభజ్ఞులైన వైద్య నిపుణులు, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత సంపత్తితో యూనివర్సల్ హాస్పిటల్స్ సేవలందిస్తుందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ‘నీ ప్లస్’ అగ్‌మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా మోకీలు మార్పిడి, తుంటి మార్పిడి, విరిగిన ఎముకలకు శస్త్రచికిత్సలు, ఆర్థ్రోస్కోపీ, కీళ్ల నొప్పులకు చికిత్సలు, మెడ, వెన్నునొప్పులకు చికిత్సలను అత్యాధునిక విధానంలో నిర్వహించవచ్చని అన్నారు. నీ ప్లస్ ద్వారా మోకీలు మార్పిడి చికిత్సలను అత్యంత కచ్చితత్వంతో సులువుగా చేయవచ్చని, ఈ విధానంలో అతి తక్కువ కోతతో సర్జరీ చేయడం వల్ల పేషెంట్ త్వరగా కోలుకోగలుగుతారని తెలిపారు. యూనివర్సల్ హాస్పిటల్స్ నందు, డాక్టర్ ప్రశాంతి కోనేరు నేతృత్వంలో చిన్నపిల్లలు, నవజాత శిశు విభాగం, డాక్టర్ ఆరుమిల్లి కృష్ణ ఫణీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చర్మ సంరక్షణ, సౌందర్య చికిత్సా విభాగం, డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి సారథ్యంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తమ హాస్పిటల్స్ నందు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాజేంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆరుమిల్లి ప్రసాద్ చౌదరి, డాక్టర్ ఆరుమిల్లి సీతారత్నం, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *