గూడూరు రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

-తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణకు చర్యలు తీసుకోండి
-తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ గురుమూర్తి

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త:
గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కీలక మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో రైల్వే పరిపాలనను మరింత అందుబాటులోకి తీసుకురావాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు.

గూడూరు పట్టణంలో సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని, గూడూరు రైల్వే స్టేషన్ పశ్చిమ వైపున ఉన్న బుకింగ్ కౌంటర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని, అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. అలాగే అంబేద్కర్ నగర్ అండర్‌పాస్‌ను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. గూడూరు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని పేర్కొన్నారు.

తిరుపతి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగానే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రంగా కూడా విస్తరిస్తోందని ఎంపీ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, 160కి పైగా రైళ్లు రాకపోకలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుపతి, రేణిగుంట ప్రాంతాలకు సంబంధించిన రైల్వే పరిపాలన వేర్వేరు విభాగాల పరిధిలో ఉండటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి, రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అది ఏర్పాటు అయ్యే వరకు గుంతకల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ వారానికి కనీసం మూడు రోజులైనా తిరుపతి, రేణిగుంట ప్రాంతాల నుంచి పరిపాలనా కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరును తిరుపతి ఈస్ట్‌గా మార్చాలని, రేణిగుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయించే నిధులను పెంచాలని, దుగరాజపట్నం రైల్వే కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

మరోవైపు తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ వైపున గోపాల్ కాలనీ వద్ద ఉన్న 12 అడుగుల వెడల్పు గల పాత రహదారిని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు మరో వినతిపత్రం అందజేశారు. గోపాల్ రాజ్ కాలనీ, యాదవ కాలనీ, స్టేట్ బ్యాంక్ కాలనీ, శివాజీ నగర్, హథీరాంజీ కాలనీ, బైరాగిపట్టెడ ప్రాంతాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఈ రహదారిని రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు.

తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ మార్గంలో సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేశారని, స్థానిక ప్రజలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, నిత్యం రైల్వే స్టేషన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగా ఉందని వివరించారు. అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రహదారిని బారికేడ్లతో మూసివేయడం, అక్కడ ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండటంతో భవిష్యత్తులో ఈ మార్గం పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత ప్రహరీ గోడ నిర్మాణాన్ని పునఃపరిశీలించి, ప్రస్తుతం ఉన్న 12 అడుగుల రహదారిని యథావిధిగా కొనసాగించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

గూడూరు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణ, తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరు మార్పు, రేణిగుంట స్టేషన్ ఆధునీకరణ, దుగరాజపట్నం రైల్వే కారిడార్ పనుల వేగవంతం, తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ వైపున ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటం వంటి అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. తన వినతులపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారని ఎంపీ వెల్లడించారు.