పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్‌గా ఖాజావలి ఏకగ్రీవ ఎన్నిక

-హర్షం వ్యక్తం చేసిన సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్‌గా ఖాజావలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పీఆర్వో స్థాయి నుంచి దశలవారీగా ఎదుగుతూ జాయింట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న జర్నలిస్టుల ఆత్మీయుడు, లాల్జాన్ (ఆర్జేడీ) సోదరుడు ఖాజావలి రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా మూడు దశాబ్దాలకు పైగా అదే పార్టీలో కొనసాగుతున్న ఖాజావలి రాజకీయ ప్రస్థానం అభినందనీయమన్నారు.
లాల్జాన్, ఇతర మిత్రుల సహకారంతో పిడుగురాళ్లలో ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభను విజయవంతంగా నిర్వహించిన మధుర జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
మున్ముందు ఖాజావలి ప్రజలకు మరింత సేవలందిస్తూ, పిడుగురాళ్ల పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని నిమ్మరాజు చలపతిరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మరోసారి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.