12వ పిఆర్సీకి డిశంబరు 31లోగా వినతులు, సమస్యలు, అభ్యంతరాలు, సూచనలు అందించాలి

-ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు కమీషన్ కార్యదర్శి డా.పి.లక్ష్మీనర్సింహం విజ్ణప్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
12వ వేతన సవరణ సంఘం(పే రివిజన్ సంఘం)కు డిశంబరు 31లోగా ఉద్యోగులు,ఉద్యోగ సంఘాల,వివిధ అసోసియేషన్లు వారి వినతులు,సూచనలు, అభ్యంతరాలను అందించాలని పే రివిజన్ కమీషన్ కార్యదర్శి డా.పి.లక్ష్మీనర్సింహం విజ్ణప్తి చేశారు.వినతులు,సూచనలను కార్యదర్శి,12వ వేతన సవరణ సంఘం,గది నం.188,గ్రౌండ్ ఫ్లోర్,4వ భవనం,ఆంధ్రప్రదేశ్ సచివాలయం,వెలగపూడి,అమరావతి-522238.ఈ-మెయిల్: secytoprc-12@ap finance. gov.in కు డిశంబరు 31లోగా సమర్పించాలని ఆయన విజ్ణప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలన(ఎస్‌సి.ఎ) శాఖ జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నం.200, తేదీ 01-10-2026 ద్వారా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కమీషనర్ గా 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించింది.కమీషన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఏడాది లోగా కమీషన్ నివేదిక సమర్పించాల్సించిదిగా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నం.68, తేదీ 12-07-2023లో పేర్కొన్న విధివిధానాలు (Terms of Reference) వర్తిస్తాయని ఆఉత్తర్లుల్లో స్పష్టం చేసింది.వేతన సవరణ సంఘం కార్యదర్శిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.పి.లక్ష్మీ నర్సింహంను నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో 12వేతన సవరణ సంఘం కార్యకలాపాలు వేగవతం కానున్నాయి.
వేతన సవరణ సంఘం పరిశీలించనున్న అంశాలు
1.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,స్థానిక సంస్థలు,ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల వేతనాలు,ఇతర ప్రయోజనాలు,సర్వీసు నిబంధనలకు సంబంధించిన సూత్రాలను రూపొందించడం.
అలాగే కింది ఉద్యోగుల విషయాలను కూడా పరిశీలించనుంది.
విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది,ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యోగులు,జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉద్యోగులు,వర్క్‌చార్జ్డ్ ఉద్యోగులు,
పూర్తి కాల కాంటింజెంట్ ఉద్యోగులు.వీరికి ప్రస్తుతం అందుతున్న అన్ని ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మరియు సాధ్యమైన మార్పులపై సిఫార్సులు చేయనుంది.
అయితే ఈ కింది ఉద్యోగులు ఈ సంఘం పరిధిలోకి రారు:
a) ప్రభుత్వ కళాశాలలు,యూజీసీ/ఏఐసీటీఈ మరియు ఐసీఏఆర్ పే స్కేళ్లు పొందుతున్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది.అలాగే రెండవ జాతీయ న్యాయ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనాలు పొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరియు రాష్ట్ర న్యాయ సేవల్లోని అధికారుల అంశాలను కూడా ఈ సంఘం పరిశీలించదు.
2.కరువు భత్యం (DA):
ప్రస్తుతం అమలులో ఉన్న కరువు భత్యాన్ని వేతనంలో ఎంతవరకు విలీనం చేయవచ్చో పరిశీలించాలి.అలాగే కరువు భత్యాన్ని విలీనం చేసిన తరువాత కొత్త వేతన స్కేళ్లను రూపొందించి సవరించిన వేతన స్కేళ్లలో వేతన నిర్ధారణ విధానాన్ని సూచించాలి.
3.ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (Automatic Advancement Scheme):
కాలానుగుణంగా మార్పులు చేసిన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ పథకాన్నిపరిశీలించాలి.ఈ పథకం అమలులో ఎదురైన సమస్యలు లోపాలను అధ్యయనం చేయాలి.ప్రస్తుత రూపంలోనే ఈ పథకాన్ని కొనసాగించాలా లేదా అనే అంశంపై పరిశీలించి సిఫార్సులు చేయాలి.
4.ప్రత్యేక వేతనాలు,అలవెన్సులు:
ప్రస్తుతం అందిస్తున్న వివిధ రకాల ప్రత్యేక వేతనాలు (Special Pays), పరిహార భత్యాలు (Compensatory Allowances),ఇతర అలవెన్సులు,నగదు లేదా వస్తు రూపంలో అందించే ప్రయోజనాల అవసరాన్ని పరిశీలించాలి.వాటిని కొనసాగించాలా లేదా అనే అంశంపై సిఫార్సులు చేయాలి.కొనసాగించాలని నిర్ణయిస్తే వాటి రేట్లు,నిబంధనలు,భవిష్యత్తులో అమలు చేయాల్సిన ఇతర షరతుల్లో అవసరమైన మార్పులను సూచించాలి.
5.పెన్షన్ విధానం:
పెన్షనర్లకు ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ విధానాన్ని పరిశీలించి సమీక్షించాలి.అవసరమైన మరియు సాధ్యమైన మార్పులపై సిఫార్సులు చేయాలి.
6.పోస్టుల గెజిటెడ్ హోదా:
వివిధ కేటగిరీల పోస్టులకు గెజిటెడ్ హోదా కల్పించేందుకు అవసరమైన సూత్రాలు,ప్రమాణాలు, అర్హతలు,మార్గదర్శకాలను రూపొందించాలి.అలాగే ఉద్యోగ సంఘాలు,పరిపాలనా విభాగాలు గెజిటెడ్ హోదా కల్పించాలని ప్రతిపాదించిన పోస్టుల కేటగిరీలపై సూచనలు చేయాలి.
7.మానవ వనరుల సమీక్ష:
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మానవ వనరులను సమీక్షించాలి.ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంట్రాక్టు,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సహా అన్ని రకాల సిబ్బంది అవసరాలను పరిశీలించాలి.
8.ఇతర అంశాలు:
వేతన సవరణ సంఘం పదవీకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనకు అప్పగించే ఇతర అంశాలపై కూడా సిఫార్సులు చేయాలి.
9.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి:
వేతన సవరణ సంఘం తన సిఫార్సులను రూపొందించే సమయంలో రాష్ట్రం యొక్క మొత్తం ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవచ్చు.
అభిప్రాయాలు,వినతుల స్వీకరణ
వేతన సవరణ సంఘం తనకు వచ్చే వినతులను స్వీకరించడం,సాక్షులను విచారించడం, అవసరమైన సమాచారాన్ని కోరడం వంటి అంశాలపై స్వంత విధానాన్నిరూపొందించు కోవచ్చు.సచివాలయ విభాగాలు,శాఖాధిపతులు వేతన సవరణ సంఘం కోరినప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించాలి.సంఘానికి అవసరమైన సహకారం,సహాయాన్ని అందించాలి.వేతన సవరణ సంఘం పరిశీలనకు నిర్దేశించిన పై అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయదలచిన వారందరి నుంచి వినతులు ఆహ్వానిస్తున్నట్టు కమీషన్ కార్యదర్శి డా.లక్ష్మీనర్సింహ తెలియజేశారు.
ఈకింది సంస్థలు,సంఘాలు, వ్యక్తులు తమ వినతులు, మెమోరాండాలు సమర్పించవచ్చు:
ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,ఉద్యోగుల అసోసియేషన్లు,పెన్షనర్ల సంఘాలు,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,జిల్లా గ్రంథాలయ సంస్థలతో సహా స్థానిక సంస్థలు,ఎయిడెడ్ సంస్థలు,జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం,ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహా విశ్వవిద్యాలయాలు.
వినతులు పంపాల్సిన చిరునామా:
కార్యదర్శి,12వ వేతన సవరణ సంఘం,గది నం.188,గ్రౌండ్ ఫ్లోర్,4వ భవనం,ఆంధ్రప్రదేశ్ సచివాలయం,వెలగపూడి,అమరావతి-522238.ఈ-మెయిల్:secytoprc-12@ap finance. gov.in