-ఎస్సి ఫిమేల్ నర్సింగ్ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ
-శిక్షణ అనంతరం ఇజ్రాయెల్ లో నెలకు రూ.2 లక్షల వేతనంతో ఉపాధి కల్పన
-మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి
-విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఇజ్రాయిల్ నర్సింగ్ ట్రైనింగ్ వర్క్ షాప్ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డా. స్వామి
అమరావతి / విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎస్సి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
మంగళవారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఇజ్రాయిల్ నర్సింగ్ ట్రైనింగ్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా మంత్రి డా.స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పీఎం ఏజెఏవై కార్యక్రమంలో భాగంగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఏఎన్ఎం/జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సి మహిళలకు 3 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా తొలి విడతగా 1100 మందికి శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ అనంతరం ఇజ్రాయెల్ లో నెలకు రూ.2 లక్షల వేతనంతో ఉపాధి కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే జర్మన్ లాంగ్వేజ్‌లో 300 మందికి శిక్షణ ఇచ్చామని, వారికి జర్మనీలో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎస్సి, ఎస్టీ నిరుద్యోగ యువతకు గ్రూప్స్ తో పాటు డీఎస్సీ, ఆర్ఆర్ బీ, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. డిఎస్సి ఉచిత శిక్షణతో 400 మంది ఉద్యోగాలు సాధించారని మంత్రి అన్నారు. ఎస్సి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని, పేద ప్రజల తలసరి ఆదాయం పెరిగి రాష్ట్రంలో పేదరికం ఉండకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని అందుకనుగుణంగా సాంఘిక సంక్షేమ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎస్సి విద్యార్థులు, నిరుద్యోగ యువతను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తూ అండగా ఉంటోందన్నారు. అర్హులైన వారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకుని జీవితంలో స్థిరపడాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి IAS ఎం. ఎం. నాయక్, APSWREIS కార్యదర్శి IAS తేజ్ భరత్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, ఎస్సి కార్పొరేషన్ GM చెన్నయ్య, అన్ని జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, నర్సింగ్ అభ్యర్థులు పాల్గొన్నారు.
