దీపావళి క్రాకర్స్ విక్రయాలకు జిఎంసి సింగిల్ విండో అనుమతి తప్పనిసరి… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా నగరంలో ప్రమాద రహితంగా బాణాసంచా (క్రాకర్స్) షాపులను ఏర్పాటు చేసుకోవడానికి గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సింగిల్ విండో కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ వ్యాపారస్తులకు తెలిపారు. గురువారం గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో సిటి ప్లానర్ డి.రాంబాబు, డిఎఫ్ఓ ఎం.శ్రీనివాసరెడ్డి, ఏడిఎఫ్ఓ కృష్ణారెడ్డిలతో కలిసి నగరంలో దీపావళి క్రాకర్స్ విక్రయ షాపుల ఏర్పాటు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అనుమతించిన నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు. ఫైర్ ఎన్ఓసి, ట్రాఫిక్ పోలీస్ అనుమతి, జిఎస్టీ చెల్లించిన రశీదు, స్థల యజమాని అంగీకార పత్రం, రెవెన్యూ అనుమతి పత్రాలను జత చేస్తూ, జిఎంసిలోని సింగిల్ విండో కౌంటర్ లో దరఖాస్తు చేయాలని, వాటిని పరిశీలించి, అనుమతి మంజూరు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలలో గానీ, ముందస్తు అనుమతి లేకుంఢా గానీ అనధికారికంగా షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగినంత నీరు, ఇసుక బకెట్లు మరియు అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా విద్యుత్ వైరింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు.
బాణాసంచా విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలుదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యాపారస్తులందరూ అధికారుల సూచనలను పాటిస్తూ, సురక్షితమైన పద్ధతుల్లో వ్యాపారాలు నిర్వహించి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి సహకరించాలన్నారు.