-పి.బి. సిద్ధార్థలో అదానీ గ్రూప్ సీఈఓ భౌమిక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విద్య, నైపుణ్యాలు మన దేశంలో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, పరిశ్రమల అవసరాల మేరకు యువతలో నైపుణ్యాలు పెంపొందించేలా పాఠ్య ప్రణాళికలు లేవని అదానీ గ్రూప్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం సీఈఓ రాబిన్ భౌమిక్ అన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అల్లైడ్ సైన్సెస్ అసోసియేషన్ సంయుక్తంగా గురువారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న వికసిత్ భారత్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాబిన్ భౌమిక్ ఎం.బి.ఎ. విభాగం బుధవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ మాట్లాడారు. విద్య అనేది కెరీర్ ను శాసించ కూడదన్నారు. నైపుణ్యాలు లేకపోవడమే సమస్య అని, భారతదేశపు విద్యా ప్రణాళికను అన్ని దశల్లో సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో నైపుణ్యాలు లేని వారినే సమస్యలు చుట్టుముడతాయని, ప్రపంచం మొత్తం నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటున్న ఈకాలంలో యువత వ్యక్తిగత సామర్థాలు పెంచుకోవడంపై దృష్టి నిలపాలని కోరారు.
అదానీ గ్రూపు తన సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ద్వారా 20 ఏళ్ల లోపు యువకులకు తిరుపతిలో గ్రీన్ ఎనర్జీ రంగంలో శిక్షణ ఇస్తోందన్నారు. గుజరాత్ లో మానవ నివాసం లేని ఖావ్ డా ఎడారి ప్రాంతంలో 2022లో పరిశ్రమ స్థాపనకు ఎవరూ చేయని సాహసం చేసిన అదానీ గ్రూపు మూడేళ్ల వ్యవధిలోనే ఆ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మార్చిందన్నారు. సౌకర్యాలు లేని ఆఫ్రికా నుంచి అభివృద్ధి చెందిన యూరప్ వరకు అదానీ గ్రూపు విస్తరించినా భారతదేశ పురోగతి తన ప్రధాన లక్ష్యమని, వికసిత్ భారత్ సాకారమయ్యేందుకు లక్షల కోట్ల రూపాయలు విద్య, ప్రజారోగ్యం రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. విశాఖలో స్కిల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 220 బిలియన్ డాలర్లు మార్కెట్ విలువ కలిగిన అదానీ గ్రూపు టాటా సంస్థల 300 బిలియన్ డాలర్లు విలువను అధిగమించడం వెనక భవిష్యత్ అవసరాల అంచనాలలో కచ్చితత్వం వుందన్నారు.
అయితే హ్యూమన్ క్యాపిటల్ లేకపోవడం పెద్ద లోటన్నారు.ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డీన్ ప్రొఫెసర్ రాజేష్ సి.జంపాల, డైరెక్టర్ వేమూరి బాబూరావు పాల్గొన్నారు.
