సోనియా గాంధీ ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రచించిన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ పుస్తక పరిచయ కార్యక్రమం శనివారం విజయవాడలోని శ్రీ రామా ప్యాలస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడింది.

మాజీ మంత్రి, CWC సభ్యులు డా. ఎన్. రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, CWC సభ్యులు గిడుగు రుద్రరాజు, మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. దిలీప్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి. శ్రీనివాసరావు, సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. దివాకర్ బాబు, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు టి. మనోహర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ నాయకులు గొళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సాహితీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం ప్రచురణ కాకుండా ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్‌ను బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న అనుభవాలు, జీవితంలో ఎదురైన కష్టనష్టాలు, త్యాగాలను ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె ఎంతోమందితో విమర్శలు ఎదుర్కొన్నారని, కుటుంబ సభ్యులను కోల్పోయారని, అయినప్పటికీ భారతదేశంలో ఉంటూ మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించారని అన్నారు. రాజీవ్ గాంధీ మరణానంతరం దేశవ్యాప్తంగా ఆమెను ప్రధానమంత్రి కావాలని కోరినప్పటికీ, ఆ పదవిని తృణప్రాయంగా వదులుకున్న గొప్ప త్యాగశీలి సోనియా గాంధీ అని కొనియాడారు.

డా. ఎన్. రఘువీరారెడ్డి మాట్లాడుతూ, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి రోజున సోనియా గాంధీ ఆత్మకథ పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు నెహ్రూ అని కొనియాడారు. అటువంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన త్యాగమయి, నిస్వార్థ సేవాభావం కలిగిన శక్తివంతమైన మహిళ సోనియా గాంధీ అని పేర్కొన్నారు.

తాను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, చిన్నతనంలోనే నీలం సంజీవరెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రచారంలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు. ఇటలీ నుంచి 19 ఏళ్ల యువతిగా సుమారు ఆరు దశాబ్దాల క్రితం భారతదేశానికి వచ్చిన సోనియా గాంధీ, ప్రేమానుబంధంతో ఈ దేశాన్ని తన సొంత దేశంగా స్వీకరించి, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు.

సోనియా గాంధీ జీవిత ప్రయాణం, రాజకీయ అనుభవాలు, త్యాగాలు, ప్రజాసేవలో ఆమె పోషించిన పాత్రకు ఈ ఆత్మకథ అద్దం పడుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ పుస్తకం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.