-ఆటో డ్రైవర్లకు, కూలీలకు స్వర్ణయుగమే.
-18వ డివిజన్ లో ఆటో స్టాండ్, పార్టీ జెండా దిమ్మను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.30 వేల కోట్లతో జనవరి నుంచి అమరావతిలో అద్భుతమైన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణి గారి తోట కనకదుర్గమ్మ వారిధి దగ్గర శ్రీ కనకదుర్గమ్మ వారిధి గూడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవం, టీడీపీ జెండా దిమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ మాట్లాడుతూ వచ్చే జనవరి నుంచి రూ.30 వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయని చెప్పారు. 2014-19 సంవత్సరాల కాలంలోనే కేవలం రూ.1500 కోట్ల తోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో అద్భుతమైన భవనాలను నిర్మాణం చేశారని చెప్పారు. ఇప్పుడు రూ.30 వేల కోట్లతో మరింత అద్భుతమైన భవనాలను, రహదారులను నిర్మాణం చేయనున్నారని చెప్పారు. అమరావతి నిర్మాణం పూర్తి అయితే కూలీలకు, ఆటో డ్రైవర్లకు స్వర్ణయుగం మొదలవుతుందని అన్నారు. గతంలో 2014 -19 సంవత్సరంలో అమరావతి నిర్మాణం వల్ల నగరంలోని ఆటో డ్రైవర్లకు, కూలీలకు జీవనోపాధి మెరుగుపడిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నందువల్ల ఆటో డ్రైవర్లకు కూలీలకు స్వర్ణయుగం మళ్లీ మొదలవుతుందని అన్నారు. కార్మికులకు మేలు చేసేందుకు ఉచిత ఇసుక పాలసీని అమలులోకి తెచ్చామని, ఈ పాలసీలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ లోపాలను సవరించేందుకు సబ్ కమిటీని వేసి మరింత పటిష్టంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. సంక్షేమ పథకాలకు తెలుగుదేశం పార్టీ మారుపేరని అన్నారు అన్న నందమూరి తారక రామారావు ప్రారంభించిన రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు గృహ నిర్మాణం, పింఛన్ పథకం చాలా గొప్ప పథకాలని చెప్పారు. రూ.35 రూపాయలతో ప్రారంభించిన పెన్షన్ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.4వేల కు పెంచారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలామంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవని, విద్యార్థులకు చదువులు సరిగా లేవని, కూలీలు పని చేయడానికి పనులు కూడా లేని పరిస్థితులు రాష్ట్రంలో మనం చూసామని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుఅధికారంలోకి వచ్చారని నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడంతోపాటు చదువుకున్నయువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పనకు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పేదలకు అండగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మనందరం మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఆరేపల్లి వెంకటేశ్వరరావు, నూతక్కి రామ్మోహన్, కొప్పోలు శ్రీనివాస్ చౌదరి,కొక్కిరితిరుపతయ్య,మర్రి వెంకట సుబ్బయ్య, శౌరి, ప్రకాష్, షేక్ మీరావలి, మూలం మల్లికార్జున్, చల్లా సుబ్బయ్య,ఆకుల మల్లి, సిద్దయ్య, మోతుకూరు బాబ్జి, నడిగట్ట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.