-2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా తెలుగుజాతి నిలవాలన్నదే నా ఆకాంక్ష
-ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలి
-తల్లిని ఎలా గౌరవిస్తామో భాషనూ అలాగే గౌరవించాలి
-తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్
-ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజం సాధిస్తాం
-హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని, 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా తెలుగుజాతి నిలవాలన్నదే తన ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజం సాధిస్తామని అన్నారు. హైదరాబాద్ హెచ్ ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…ప్రపంచంలో ఉండే తెలుగువారందరినీ ఒకే వేదికపై చూడటం చాలా సంతోషంగా ఉంది. తెలుగువారి గౌరవాన్ని చాటిచెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలను ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడం మనకు గర్వకారణం. డీవీఎస్ రాజు, ఇందిరాదత్ సహా ప్రముఖులు ఈ సభలకు ఎనలేని సేవలు అందించారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకూ శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకూ ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒకటే . ఏపీ, తెలంగాణలోనే కాదు…అమెరికా సహా ఏ దేశంలో చూసినా మన తెలుగువారే. బ్రెయిన్ డ్రెయిన్…బ్రెయిన గెయిన్ అవుతుందని నేను 1996లో ముఖ్యమంత్రి అయ్యినప్పుడే చెప్పాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికంటే విదేశాల్లో ఉన్న తెలుగువారే భాషా, సంప్రదాయాలను కాపాడుతున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిని నేను ఆనాడే ఊహించా
1996లో నేను సీఎం అయినప్పుడు ఈ ప్రాంతమంతా రాళ్లు, రప్పలు. ఇది ప్రపంచంలోనే ఐటీ సిటీగా తయారవుతుందని నేను ఆనాడే ఊహించాను. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఉంది. దేన్నయినా ముందే ఊహించగలగాలి. 96లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నెలనెలా జీతాలు ఇవ్వలేక మూడునెలలకు ఒకసారి ఇచ్చేవాళ్లం. నేను విజన్ 2020 అన్నప్పుడు అందరూ ఎగతాళి చేశారు. తెలుగు ఏంజిల్స్ అనే స్టార్టప్ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మనమంతా సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలము. నాడు టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగా తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
ప్రపంచమంతా తెలుగువారు రాణిస్తున్నారు
సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన వ్యక్తి. నేడు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అదీ మన తెలుగువారి శక్తి. దేశానికి దశ, దిశ చూపిన పీవీ మన తెలుగు బిడ్డ. 1996లో నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికే పీవి. నరసింహారావు గారు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన సంస్కరణలను అందిపుచ్చుకుని ముందుకెళ్లాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ తిండిపెడుతుందా, సెల్ ఫోన్ లు ఉపయోగమా అని ఎగతాళి చేశారు. యువత టెక్నాలజీని అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా రాణించారు. ప్రపంచంలో అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నది మన తెలుగువారే. ఏదేశంలోనైనా ఖరీదైన ప్రాంతానికి పోతే అక్కడ మన తెలుగు మాట్లాడే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2023-24లో 3 లక్షల 30 వేల మంది భారతీయులు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లగా అందులో లక్షా 80 వేలమంది తెలుగువారే. అమెరికాలో 12వ భాష తెలుగు. మున్ముందు అన్ని దేశాల్లో తెలుగు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. యువత అవకాశాలు కోసం విదేశాలు వెళ్లారు. అయితే ఏ దేశంలోనైనా మనకు ఆమోదం రావాలంటే అక్కడి ప్రజలకు మనం సేవలు అందించాలి. అదే సమయంలో జన్మభూమిని మర్చిపోకూడదు. కర్మభూమికి కూడా సేవలు చేయాలని నేను కోరుతున్నాను. నేడు ఏఐ, డీప్ టెక్నాలజీ యుగం నడుస్తోంది. ప్రతి ఇంటికీ ఒక ఐటీ ఉద్యోగి ఉండాలి. ప్రతి ఇంట్లో ఆంత్ర ప్రెన్యూర్ రావాలి. నేను సింగపూర్ పర్యటనలో ఒక మాట చెప్పాను. మనం పారిశ్రామిక వేత్తగా తయారై డబ్బు సంపాదిస్తే వాటిని మళ్లీ ఉపాధి కల్పనకు ఉపయోగించాలని పిలుపునిచ్చాను. ఆనాడు హైదరాబాద్ లో ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ కట్టాలనుకుని దుబాయ్ ప్రభుత్వాన్ని సంప్రదించాను. ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కడితే ఎమ్మార్ ప్రాపర్టీస్ లో విల్లాస్ కట్టేందుకు అనుమతి ఇస్తానని హామీ ఇచ్చాను. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా నేను ఇలాంటివి తెచ్చాను. ఐటీ అభివృద్ధి కోసం హైటెక్ సిటీ కట్టాను. ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చాను. ఏపీ, తెలంగాణలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారందరూ పరస్పరం సహకరించుకోవాలి. పేదరికం లేని సమాజం మన లక్ష్యం కావాలి. భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్ తయారుచేశారు. మన ప్రధాని 90 దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారంటే అది హైదరాబాద్ నుంచి తయారుకావడం గర్వకారణం. పీపీపీ విధానంలో సంపద సృష్టించవచ్చు. దక్షిణ భారతదేశంలో సంవత్సరాల తరబడి జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. . ఏపీ జనాభా గ్రోత్ రేట్ 1.5 % .దక్షణ కొరియా .5% గా ఉంది. జపాన్, చైనా, యూరప్ వంటి దేశాల్లో జనాభా తగ్గింది. ఇండియా నుంచి మనుషులను పంపమని జర్మనీ లాంటి దేశాలు కోరుతున్నారు. నీటి భద్రత , కరువు నివారణ కోసం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు చేపట్టాము. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టాను. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి పెట్టాను. స్వచ్చాంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నాము. భవిష్యత్ లో డీప్ టెక్నాలజీ దే హవా. వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. ఆఫీస్ కు రాకుండా 150 సర్వీసులు ఇంటి నుంచే అందించే సౌలభ్యం తీసుకొస్తున్నాం.
తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవలు చేసిన మహానుభావులు
ప్రపంచంలోనే తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ . తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్. పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించాడు. తెలుగుభాషకు వన్నె తెచ్చిన గిడుగు రామ్మూర్తి, తెలుగు భాషా వికాసానికి రామోజీరావు వంటి వారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. పీవీ నరసింహారావు, వెంకయ్య నాయుడు , కోకా సుబ్బారావు, జస్టిస్ రమణ, నీలం సంజీవరెడ్డి, బాలయోగి వంటి తెలుగువారు ఉన్నత పదవుల్లో రాణించారు. కరణం మల్లీశ్వరి , పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వీవీఎస్ లక్ష్మణ్, పీవి సింధు, పెండ్యాల హరికృష్ణ, వెంకటపతి రాజు, నితీష్ కుమార్ రెడ్డి వంటి తెలుగువారు ఎందరో క్రీడాకారులు తమ ప్రతిభ చాటారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ పరిశ్రమను తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశాము. నేడు తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరింది. కూచిపూడి భరతనాట్యం ,బతుకమ్మ మన సంస్కృతికి అద్దం పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.
పలువురు ప్రముఖులను సన్మానించి సీఎం చంద్రబాబు
వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలుగువారికి బిజినెస్ అవార్డులను సీఎం చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావనీర్ , తెలుగు ఏంజిల్స్ పేరుతో స్టార్టప్ లోగోను ఆయన లాంచ్ చేశారు.