-రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది.
-గ్రామంలో 1.85 లక్షలతో నిర్మించిన గోకులాన్ని ప్రారంభించి, అనంతరం సంక్రాంతి సంబరాల వేడుకల్లో….
-మంత్రి కందుల దుర్గేష్
-కలెక్టర్ పి ప్రశాంతి
నిడదవోలు( విజ్జేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త :
రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలుకోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో రు. 1.85 లక్షలతో నిర్మించిన మినీ గోకులాన్ని మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు పూజలు నిర్వహించి, పొలంలో వరి నాట్లను స్వయంగా నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఎడ్ల బండి పై గ్రామంలోకి విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. మహిళలు చిన్నారులు వేసిన ముగ్గులను, సాంప్రదాయ పద్ధతిలో హరినామం చేస్తున్న హరిదాసు సంకీర్తన ను ఆసక్తిగా తిలకించి, భోగి మంటలను వెలిగించి ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం స్థానిక కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 12500 మినీ గోకులాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ర్టంలో పశు సంపద అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. అదే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో 680 మినీ గోకులం నిర్మాణం కోసం రూ.15 కోట్ల 59 లక్షలతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 18 లక్షల వ్యయంతో 304 షేడ్స్ నిర్మాణం పూర్తి చేసామన్నారు. రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలను ఒకే రోజు ప్రారంభించే కార్యక్రమాన్ని నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ప్రారంభించారని పేర్కొన్నారు.. పాడి రైతులకు ఎంతో అవసరం అయ్యే గోకులాలను గత అయిదేళ్ల పాలనలో కేవలం 268 నిర్మిస్తే, ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే 12,500 నిర్మించి పాడి రైతులకు అండగా నిలిచిందని, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
నిడదవోలు నియోజకవర్గం లో 128 గోకులాలు మంజూరు కాగా ఇప్పటివరకు రు. 1కోటి 13 లక్షల రూపాయలతో 54 గోకులాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. పశు సంపదను రక్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ 90 శాతం సబ్సిడీని అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సొమ్ము 1600 కోట్ల బకాయిని, కూటమి ప్రభుత్వం చెల్లించి రైతులకు అండగా నిలిచిందన్నారు. ప్రతి రైతుకు ఆర్థిక సహాయంగా కేంద్ర నుంచి రు. 10 వేలు, రాష్ట్రం నుంచి రు. 10 వేలు చొప్పున మొత్తం రు. 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని త్వరలో అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం లో రైతులకు ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన వెయ్యి రూపాయలతో రు. ప్రతి నెల క్రమం తప్పకుండా రు. 4 వేల రూపాయలను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు రు. 3 వేల నుంచి రు. 15 వేల వరకు అందజేస్తున్నమన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.. గ్రామీణ రహదారులకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత్రిస్తూ జిల్లా వ్యాప్తంగా 134 కి.మీ. మేర 660 సిసి రోడ్లు నిర్మాణం పనులను రూ.65 కోట్ల 62 లక్షల చేపట్టడం జరిగిందన్నారు. వాటిలో ఇప్పటి వరకు 75 కి.మీ. మేర 424 సిసి రోడ్లు నిర్మాణం పనులను రూ.43 కోట్ల 68 లక్షల వ్యయంతో పూర్తి చెయ్యడం జరిగిందని మంత్రి తెలిపారు.
గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సంప్రదాయ పండుగలను భవిష్యత్తు తరాలకు అందించటానికి చొరవ చూపాలని, ఇటువంటి వేడుకల్ని నిర్వహించి నందుకు నిర్వాహకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న, అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో రు. రు.15.59 కోట్ల రూపాయలతో 680 గోకులాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. సంక్రాంతి వేళ పొలంలో వరి నాట్లు వేసి, మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు జిల్లా ప్రజలకి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలు మద్ధంశెట్టి వరలక్ష్మి, తిర్నాతి నాగమణి, దొడ్డిపట్ల భవాని, దేవరపల్లి హేమ సుందరికి ప్రధమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాణి సుస్మిత, డ్వామా పి డి ఎ. నాగ మహేశ్వర రావు, గ్రామ సర్పంచ్ తిక్కా శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.