Breaking News

సోము వీర్రాజు కావాలనే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు గుర్తుకురాలేదా?
-బీజేపీ డ్రామా యాత్రలు ఎవరి మెప్పు కోసం
-ప్రశాంత ప్రొద్దుటూరులో మీ ఉనికి కోసం అలజడులు సృష్టిస్తారా?
-సోము వీర్రాజును ప్రశ్నించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అన్ని మతాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇటువంటి సమయంలో ఆలయాల సందర్శన పేరుతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు డ్రామా యాత్రలకు ఎందుకు తెరదీశారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. 2016లో కృష్ణాపుష్కరాల సమయంలో దేవాలయాలను కూల్చుతూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హిందూ ధార్మిక సంఘాలు ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆనాడు ధార్మిక సంఘాలకు మద్ధతుగా సోమువీర్రాజు ఆలయాలను ఎందుకు సందర్శించలేదు? చంద్రబాబు హయాంలో శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయాల మొదలు చిన్న ఆలయాల వరకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తొలగించారు. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చివేశారు. ఆనాడు సోము వీర్రాజు ఎందుకు నోరు మెదపలేదు? చంద్రబాబు గడచిన 5 ఏళ్ళ పాలనలో 20 వేల ఆలయాలు మూతపడే పరిస్థితి ఏర్పడినప్పుడు.. దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కు కూడా లేనప్పుడు పొత్తులో ఉండి మీరు ఏం సాధించారు..? నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలన్నీ ధూపదీప నైవేద్యాలతో, నిత్య కైంకర్యాలతో కళకళలాడుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి  ఆలోచనతో గోమాత విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఇవన్నీ మీ కంటికి కనబడటం లేదా?

తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా పెడచెవిన పెడుతూ వస్తున్నారు. శ్రీవారి హుండికి కానుకలుగా వచ్చిన నలిగిన నోట్లు, పాత రూ.1,000, రూ.500 నోట్లను రిజర్వు బ్యాంకు లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్‌ చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు కనీసం స్పందించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణకు నిదర్శనం కాదా? తెలుగుదేశం హయాంలో బీజేపీ భాగస్వామ్యంతోనే ఆలయ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేసింది మర్చిపోయారా? తిరుమలలో పోటు గదులను మూసివేసి వాటిలో తవ్వకాలు జరిపారు. దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని అవమానించారు. ఆలయాలపై చంద్రబాబు హయాంలో నియమించిన పాలక మండళ్ళ పెత్తనం అధికమై.. వేధింపులు తట్టుకోలేక అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి సదావర్తి భూములతో సహా.. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను మింగేశారు. ఇవన్నీ మీ భాగస్వామ్యంలో జరగలేదా..? తెలుగుదేశంతో పొత్తులో ఉన్నప్పుడు ఇవన్నీ మీ కంటికి కనిపించలేదా? ఆనాడు హిందువుల మనోభావాలు సోమువీర్రాజుకు ఎందుకు గుర్తుకురాలేదు..? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాల పునర్నిర్మాణంతో జీవకళను సంతరించుకుంటున్నాయి. టీటీడీ ప్రవేశపెడుతున్న కార్యక్రమాలతో ప్రజలలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇటువంటి సమయంలో మీ డ్రామా యాత్రలు ఎవరి మెప్పు కోసం? పైగా ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో వివాదం రేపాలని ప్రయత్నిస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి ఇంకా రాకముందే.. విగ్రహాన్ని పెట్టేస్తున్నట్లు ధర్నా చేయడం ఏమిటి..? ఇప్పటికైనా మీరు చేస్తున్న మత రాజకీయాలకు స్వస్తి పలకి.. అన్ని మతాల శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని కోరుకుంటున్నాను.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *