అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో పరిపాలన పారదర్శకంగా ఉందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ఆండ్రూ ఫ్లెమింగ్ కితాబిచ్చారు. ఏపీలో పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ని కలిశారు. విజయవాడలో ఆండ్రూ ఫ్లెమింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధితోపాటు మహిళాభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వాలను బ్రిటన్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆయా దేశాలకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి తమ వైపు నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.
మహిళా సాధికారతలో ఏపీ నంబరు 1
మహిళా సాధికారత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని ఎమ్మెల్యే చెప్పారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తొలి రెండేళ్ల పాలన చూస్తే మహిళలకే ఎక్కువగా లబ్ధి చేకూరిందని తెలిపారు. రెండేళ్లలో రూ.1,31,725.55 కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేస్తే… ఈ మొత్తంలో నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.95,528.50 కోట్లు చేరాయని వివరించారు. అయితే ఈ మొత్తం దాదాపు 90 శాతానికి పైగా అంటే రూ.88,040.29 కోట్లు కేవలం మహిళల ఖాతాల్లోకే చేరాయని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తున్నామని, రేషన్ కార్డులు సైతం మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమం మొత్తం మహిళలకు మేలు చేసే విధంగానే రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.
నాడు- నేడు అద్భుతం త్వరలో చిలకలూరిపేటలో పర్యటిస్తాను – బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ఆండ్రూ ఫ్లెమింగ్
నాడు- నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న విధానం అద్భుతంగా ఉందని ఫ్లెమింగ్ కొనియాడారు. ఎమ్మెల్యే విడదల రజిని ఈ సందర్భంగా పలు పాఠశాలల ఫొటోలు చూపించగా.. ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నాడు- నేడు పథకానికి బ్రిటన్ నుంచి ఆర్థిక సహకారం ఏపీకి అందేలా చూస్తానని తెలిపారు. నాడు- నేడు పథకం కింద చిలకలూరిపేటలో నూతనంగా రూపుదిద్దుకున్న పాఠశాలలను తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని, అలానే ప్రభుత్వం సంక్షేమ పధకాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. యునైటెడ్ కింగ్ డమ్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేసిందని, ఇకపై తమ దేశంలో ఎవరైనా చదువుకోవచ్చని, ఏ దేశాలకు చెందిన వారైనా ఉద్యోగాలు పొందొచ్చని తెలిపారు. దీనివల్ల ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ ఎక్కువగా లాభపడుతుందని తాము భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత చురుకుగా ఉంటారని, తమ దేశంలో చదువుకునేందుకు వచ్చే వారికి వీసా జారీని సులభతరం చేశామని వివరించారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ రాజకీయ, ఆర్థిక సలహాదారు నళినీ రామచంద్రన్ కూడా ఉన్నారు.