-గోదావరి పుష్కరాలు నాటికి పర్యాటకులకు అందుబాటులో హోమ్ స్టే
-బోటింగ్, రిసార్ట్స్, ఘాట్స్ అభివృద్ధి పై దృష్టి సారించాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన ప్రాంతం అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ , ఇకో టూరిజం తో కూడిన ప్రణాళిక సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో శుక్రవారం సాయంత్రం పర్యాటక, దేవాదాయ, ఆర్ ఎమ్ సి, కన్సల్టెంట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గోదావరి పుష్కర్ ప్రాజెక్ట్ నేపథ్యంలో సమగ్ర అభివృద్ధి కోసం పర్యాటక రంగంలో చేపట్టనున్న పనులకి సంబంధించి ప్రతిపాదించిన పనులు పై సమగ్ర నివేదిక అంద చెయ్యాలని ఆదేశించారు. అదే నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతాలలో టెంపుల్, ఇకో, ఇతర అనుబంధ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల యొక్క వివరాలతో నివేదిక అందచేయాలని ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ లు, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, ఇతర ఘాట్ లు , సినిమా చెట్టు, నిడదవోలు కెనాల్ , వాడపల్లి కెనాల్ రహదారి , కడియపు లంక ప్రాంతంలో , గోదావరి ఐ ల్యాండ్, హోమ్ స్టే తదితర విషయాలు దృష్టిలో ఉంచుకొని నివేదిక అందచేయాలన్నారు. అదే విధంగా పురుషోత్తమ పట్నం లో ఏనుగుకొండ ప్రాంతంలోని 7 ఎకరాల ప్రాంతంలో ఇకో రిసార్ట్స్ కు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు. రానున్న పుష్కరాలు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మండువా లోగిళ్ళు, పురాతన కాలం నాటి భవనాలు, పెంకుటి ఇళ్ళు హోమ్ స్టే కోసం గుర్తించి, వాటిని పర్యాటకులకు అందుబాటులో ఉండేలా తగిన సమగ్ర నివేదిక అంద చెయ్యాలని సూచించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలో బోటింగ్ విహారానికి అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చెయ్యాల్సి ఉంటుందన్నారు. ప్రజలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయంలో ఇక్కడ గడిపేలా పర్యటక అభివృద్ధి పనులు చేపట్టడం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు.
పర్యాటక రంగంలో అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలు కార్యరూపం అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎంసి అధికారులు ఎస్ ఈ ఎమ్ సిహెచ్ కోటేశ్వర రావు, ఈ ఈ మదర్సా ఆలీ, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, ఎండోమెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News