– నిరంతర పర్యవేక్షణ, విస్తృత తనిఖీలతో నిఘా
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అత్యంత పారదర్శకంగా పౌర సరఫరాల శాఖ ద్వారా సేవలందించడం జరుగుతోందని.. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నిరాటంకంగా సరుకుల పంపిణీ జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ, రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సరుకులు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న రైస్ కార్డుల సేవలు, కార్డుదారులకు అందిస్తున్న సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం, బియ్యం నాణ్యతా పరీక్ష ప్రక్రియ తదితరాలతో కూడిన పోస్టర్లను, కరపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 957 రేషన్ దుకాణాల పరిధిలో 5,90,000 రైస్‌కార్డులున్నాయని, ప్రతినెలా కార్డుదారులకు దాదాపు 8,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోందని.. దీపం 2.0 పథకాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. పౌర సరఫరాల శాఖ సేవల్లో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు నిరంతర పర్యవేక్షణతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు జవాబుదారీతనంతో పనిచేసేలా చూస్తున్నట్లు వెల్లడించారు. కొత్త రైస్ కార్డులు, రేషన్ కార్డులో సభ్యుల చేరిక, అడ్రస్ మార్పు, ఆధార్ సీడింగ్ తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News