-జలవనరుల శాఖ ఇయన్ సి నారాయణ రెడ్డి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భావితరాలకు స్పూర్తి ప్రదాత ఇంజినీరింగ్ వ్యవస్థ పితామహుడు రాజనీతిజ్ఞుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశఅభివృద్ధికి దోహదపడే అద్భుతమైన ప్రాజెక్టుల నిర్మాణంలో అందించిన అమూల్యమైన సేవలు నేటితరం ఇంజినీర్లకు ఆదర్శప్రాయమని ఇంజినీర్లులోనే కాక రైతాంగం హృదయాలలో ఆయన చిరస్మరణీయుడని జలవనరుల శాఖా ఇంజినీరింగ్ ఇన్ చీప్ నారాయణ రెడ్డి అన్నారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఇంజినీర్స్ డే కార్యక్రమానికి ఇయన్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై
మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నారాయణ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఇంజినీర్లలో పితామహుడు భారతరత్న బిరుదాంకితులు కీర్తి శేషులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నీటిపారుదల రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఆయన జన్మదినాన్ని ప్రభుత్వం ఇంజినీర్స్ డేగా గుర్తించడం జరిగిందన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటితరం ఇంజినీర్లు జలవనరులరంగానికి శాఖలో సేవలు అందించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చేందుకు కృషిచేయాలన్నారు. ఆయన భారతనీటి పారుదల కమిషన్ లో పనిచేసిన కాలంలో డక్కన్ ప్రాంతంలో చక్కటి నీటిపారుదల వ్యవస్థను రూపొందించారన్నారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టల నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా ఆటోమేటిక్ వరద గేట్లను ఎంతో నైపుణ్యంతో పూణె సమీపంలోని ఖడక్ వాస్లా వద్ద నెలకొల్పారన్నారు. అనంతరం గ్వాలియర్ సమీపంలో అలతిగ్రా వద్ద మైసూర్ సమీపంలోని కృష్ణారాజసాగర్ ఆనకట్టల నిర్మాణంలో ఇదే పద్ధతిని వినియోగించడం జరిగిందన్నారు. ఆయన పర్యవేక్షణలో నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియాఖండంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు అన్నారు. మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన అనేక ప్రాజెక్టుల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం ఆయన పర్యవేక్షణలోనే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. విశాఖపట్నం ఓడరేవు సముద్రపుకోత నుండి రక్షించడంలోను హైదరాబాద్ నగరాన్ని ముంపుబారినుండి రక్షించడానికి వ్యవస్థను రూపొందించడంలో వారి అమూల్యమైన సేవలు అందించారని చెప్పారు. అటువంటి మహోన్నత వ్యక్తి జయంతి ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం సంతోషదాయకమని ఆయన చూపిన బాటలో ఇంజినీర్లు సేవలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో జలవనరులశాఖ చీఫ్ ఇంజినీరు టివియన్ ఏఆర్. కుమార్ , సూపరింటెండింగ్ ఇంజినీర్లు శ్రీనివాసరెడ్డి ఏ.మురళీకృష్ణా రెడ్డి, కడియాల రవి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రాజస్వరూప్ కుమార్ కె. శ్రీనివాస్ పలువురు జూనియర్ ఇంజినీర్లు జలవనరుల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.