-ఓజోన్ పొర పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతిఒక్కరూ సామాజిక దృక్పధంతో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతిఒక్కరూ బాధ్యతగా ఒక్కో మొక్కను నాటాలని ఈ సందర్భంగా బాలబాలికలకు ఎమ్మెల్యే సూచించారు. ఆ మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా వారే తీసుకోవాలన్నారు. రిఫ్రిజరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రిక్ పరికరాలు వెలువరిస్తున్న కార్బన పదార్థాలు భూతాపాన్ని పెంచుతున్నాయన్నారు. ఫలితంగా పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటూ జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. మరోవైపు ప్లాస్టిక్ ను ఇబ్బడిముబ్బడిగా వాడటం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోందన్నారు. అదే తిరుమల కొండపైన ఎక్కడా మనకు ప్లాస్టిక్ కనిపించదన్నారు. కావున ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తతో పాటు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించేందుకు గృహ యజమానులకు 3 రకాల చెత్తడబ్బాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. దీని వల్ల కాలుష్యాన్ని చాలావరకు నియంత్రించవచ్చని తెలియజేశారు. ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములయ్యేలా ప్రతినబూనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అర్బన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరక్టర్ వీరబాబు, నాయకులు అలంపూర్ విజయ్ కుమార్, బోరా బుజ్జి, హైమావతి, రామిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు మోహన్, ఉపాధ్యాయలు మైనం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.