-శర్వాణీ మూర్తి, చల్లా సుధాకర్, జె.కె.సుబ్బారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణుల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నవని వైఎస్సార్ సీపీ నాయకులు శర్వాణీ మూర్తి, చల్లా సుధాకర్, జె.కె.సుబ్బారావు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు కేవలం రూ.285 కోట్లు కేటాయిస్తే గౌ. ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలలో రూ.344 కోట్లు (2019-20 సంవత్సరంలో రూ.126.42 కోట్లు, 2020-21 లో రూ.141 కోట్లు మరియు 2021-22 సంవత్సరంలో రూ.77 కోట్లు) బ్రాహ్మణ కార్పొరేషన్ కు కేటాయించారని తెలియజేస్తున్నాము.
తెలుగుదేశం హయాంలో 16,000 మంది బ్రాహ్మణులకు మాత్రమే పెన్షన్లు ఇవ్వగా ఈ ప్రభుత్వంలో 25,500 మందికి రూ.2,250/- చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరుగుచున్నది. 2018-19 సంవత్సరానికి బాకీ పెట్టిన రూ.8.70 కోట్ల కశ్యప పెన్షన్లు, గరుడ, మరియు భారతీ స్కీముల మొత్తాలు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదల చేయటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో మొత్తం కశ్యప పెన్షన్లు రూ.45 కోట్లు ఇస్తే ఒక్క 2020-21 లో ఈ ప్రభుత్వం రూ.76 కోట్లు YSR పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి పధకం ద్వారా సుమారు 23,000 మందికి ఒక్కొక్కరికి రూ.15,000/- చొప్పున రూ.34.50 కోట్లు ప్రభుత్వం బ్రాహ్మణ విద్యార్ధులకు ప్రతి ఏటా ఖర్చు చేస్తున్నది. నవరత్నాలలో భాగంగా YSR ఆసరా పధకం ద్వారా రూ.14.90 కోట్లు మహిళలకు విడుదల చేయడం జరిగింది. వాహనమిత్ర, జగనన్న చేదోడు వంటి ఇతర పథకాల ద్వారా కూడా అర్హులైన బ్రాహ్మణులకు ఆర్ధిక సహాయం చేయడం జరుగుతోంది.
త్వరలో అమలు కానున్న EBC నేస్తం ద్వారా అర్హులైన బ్రాహ్మణ మహిళలకు రూ.15,000/- చొప్పున ఒక్కొక్కరికి 3 సంవత్సరాల పాటు ఆర్ధిక సహాయం చేయడం జరుగుతుంది. గరుడ అంత్యక్రియల పథకం ద్వారా అర్హులందరికి 2020-21 సంవత్సరంలో రూ.10,000/- చొప్పున 466 మందికి రూ.46,60,000/- వారి అకౌంట్లకు ట్రాన్ఫర్ చేయడం జరిగింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి విదేశీ విద్యకు సంబంధించిన రూ.9.4 కోట్ల మంజూరు ప్రభుత్వం పరిశీలనలో వున్నది. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గానికి సంబంధించిన 450 మందికి రూ. 48,18,000/- వివిధ పథకాల క్రింద ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
అంతే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణులకు అవసరమైన ఋణాలు మంజూరు చేయటం జరుగుచున్నది. 2020-21 లో రూ.30 కోట్లు, 2021-22 లో ఇప్పటివరకు రూ.11 కోట్లు ఋణాలు మంజూరు చేయటం జరిగింది. పురోహిత మిత్ర పధకం ద్వారా సుమారు రూ.5 కోట్ల రూపాయల ఋణాలు పురోహితులకు, అర్చకులకు మంజూరు చేయడం జరిగింది. కరోనా నేపధ్యంలో జర్నలిస్టులకు, ప్రైవేటు టీచర్లకు రూ.25,000/- చొప్పున వ్యక్తిగత ఋణాలు మంజూరు చేయడం జరిగింది. బ్రాహ్మణ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రూ.2,00,000/- వరకు బిజినెస్ లోన్లు మంజూరు చేస్తున్నాము. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి లడ్డు తయారీదారులకు రూ.4.5 కోట్లు, సత్యదేవా సేవా మిత్ర క్రింద అన్నవరం వ్రత పురోహితులకు రూ.1.5 కోట్లు ఋణాలు మంజూరు చేయడం జరిగింది.
వాస్తవాలను గమనించకుండా పట్టుమని 25 మంది కూడా లేని కొంతమంది వ్యక్తులు చేసే చిల్లర ప్రచారాన్ని బ్రాహ్మణులందరు గమనిస్తున్నారు. బోండా ఉమా సహా తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే బ్రాహ్మణ సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాము.